ఏపిలో తెదేపా, భాజపాల స్నేహం తుమ్మితే ఊడిపోయే ముక్కులాగ ఉంది. రైల్వే మంత్రి సురేష్ ప్రభుకి తెదేపా కోటాలో రాజ్యసభకి పంపిన తరువాత రెండు పార్టీల మధ్య కొంత సయోధ్య కుదిరినట్లు కనబడింది. కానీ కృష్ణా పుష్కరాల కోసం విజయవాడలో రోడ్లు వెడల్పు చేసేందుకు కొన్ని ఆలయలాని కూల్చి వేయడంతో తెదేపాని గట్టిగా వ్యతిరేకించే రాష్ట్ర భాజపా నేతలందరూ నడిరోడ్డుపైనే మీడియా సమావేశం నిర్వహించి తెదేపా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అప్పుడు విజయవాడ ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితరులు భాజపా నేతలకి గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో మళ్ళీ రెండు పార్టీల మధ్య గొడవలు మొదలయినట్లేనని అందరూ అనుకొన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెదేపా నేతలకి, భాజపా అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర భాజపా నేతలకి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో అందరూ నిశబ్ధం అయిపోయారు. అయితే అంత మాత్రాన్న వారు రాజీ పడిపోయినట్లు కాదని అందరికీ తెలుసు.
విజయవాడలో కృష్ణలంక ప్రాంతంలో ట్రాఫిక్ చాలా విపరీతంగా పెరిగిపోయినందున మూడు సబ్ వేలు నిర్మించాలని నగరం భాజపా నేతలు చాలా రోజులుగా సంబంధిత అధికారులని, స్థానిక తెదేపా నేతలని, ప్రజా ప్రతినిధులని కోరుతున్నారు. కానీ ఎన్నాళ్లయినా ఎవరూ స్పందించకపోవడంతో వారు ఆగ్రహించి, తమ నిరసన తెలియజేసేందుకు రోడ్డుపైనే గుండు చేయించుకొన్నారు.
మిత్రపక్షంగా ఉన్న భాజపా అభ్యర్ధనలకే దిక్కులేకపోతే ఇక సామాన్యుల మాటేమిటి? అని భాజపా నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం స్థానిక తెదేపా నేతల చెవిన పడింది కానీ ముఖ్యమంత్రి హెచ్చరించినందున ఎవరూ నోరు మెదపలేదు. భాజపా అధిష్టానం రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమిస్తే కానీ తెదేపా పట్ల అది ఎటువంటి వైఖరి అవలంభించదలచుకొందో అంచనా వేయడం కష్టమే. అంతవరకు రాష్ట్ర భాజపా నేతలలో ఈ అయోమయం కొనసాగుతూనే ఉండవచ్చు.