తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని డిల్లీకి పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెదేపా అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్రప్రభుత్వం ప్రకటించే సంక్షేమ, అభివృద్ధి పధకాలు వంటి వాటిని సాధించుకొనేందుకు డిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి పదవిని ముఖ్యమంత్రి సృష్టించారు. ఇంతవరకు కంబంపాటి రామ్మోహన్ రావు ఆ బాధ్యత నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో లోకేష్ ని నియమించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కంబంపాటి పదవీకాలం ముగిసినా దానిని మళ్ళీ పొడిగించలేదు ఆయన స్థానంలో వేరెవరినీ నియమించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
నారా లోకేష్ ని ఆ పదవిలో నియమించినట్లయితే ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నట్లు ఉంటుంది. ఆ పనిలో డిల్లీలో పెద్దలతో, ఉన్నతాధికారులతో మంచి పరిచయాలు ఏర్పడితే, మున్ముందు ఆయన రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించినప్పుడు అవి ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్ వారానికి రెండు మూడు రోజులు డిల్లీ వెళ్లి వస్తారని, ఆయన డిల్లీలో ఉన్నప్పుడు అక్కడ జన్ పద్ రోడ్డులో ముఖ్యమంత్రి కోసం కేంద్రప్రభుత్వం కేటాయించిన భవనంలో బస చేస్తారని తెలుస్తోంది.
నారా లోకేష్ ని రాజ్యసభకి పంపించి సుజనా చౌదరి స్థానంలో కేంద్రమంత్రిగా చేయాలని మొదట ముఖ్యమంత్రి భావించారు. కానీ దానిపై పార్టీలోనే విమర్శలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఆ నిర్ణయాన్ని పక్కనపెట్టి, మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆలోచించారు. కానీ మళ్ళీ దానిపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఆ ఆలోచన విరమించుకొని, రాష్ట్ర తెదేపా అధ్యక్షుడుగా నియమిస్తే ఎలాగ ఉంటుందని ఆలోచించారు. తిరుపతి మహానాడు సభలో ఆయనని రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించవచ్చని ఊహాగానాలు వినిపించాయి కానీ అదీ జరుగలేదు. ఇప్పుడు ఈ కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి.
నారా లోకేష్ రాజకీయ భవిష్యత్ పై ఆదిలోనే ఇంత అయోమయం ఎందుకో అర్ధం కాదు. ఆయనని ఎలివేట్ చేయడం కోసం జరుగుతున్న ఈ ప్రయత్నాలు, ఆలోచనలు, వాటిపై ఇటువంటి చర్చలు చూస్తుంటే ఆయన కూడా రాహుల్ గాంధీ పరిస్థితిలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. పైగా తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు కెటిఆర్ అటు పార్టీలోను, ఇటు ప్రభుత్వంలోను తన సత్తా చాటుకొంటూ దూసుకుపోతుండటం వలన ప్రజలు, మీడియా కూడా నారా లోకేష్ ని ఆయనతో పోల్చి చూస్తుండటం తెదేపాకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చాలా ఇబ్బందికరంగా తయారయింది.
కెటిఆర్ రాజకీయ ఎదుగుదలకి ఆయన తండ్రి కెసిఆర్ అన్నివిధాలా సహకరిస్తున్న మాట వాస్తవమే. కెటిఆర్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని తన సత్తా చాటుకొని తండ్రికి అసలైన వారసుడిని తానేనని నిరూపించి చూపగలిగారు. కానీ నారా లోకేష్ కి కూడా ఆయన తండ్రి చంద్రబాబు మార్గం చూపి ప్రోత్సహిస్తున్నప్పటికీ, తన సత్తా చాటుకోలేకపోవడం చేతనే ఇంకా ఈవిధంగా ‘పుషింగ్’ అవసరం పడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నారా లోకేష్ ని చంద్రబాబు తన వారసుడిగా తీర్చిదిద్దాలనుకొంటునప్పుడు ఈ డొంక తిరుగుడు కధ అంతా నడపాల్సిన అవసరం ఏముంది? 2014 ఎన్నికలలోనే పోటీ చేయించి మంత్రివర్గంలో చేర్చుకొని ఉండి ఉంటే ఈపాటికి ఆయన చాలా సహజంగా ప్రభుత్వంలో ఇమిడిపోయి ఉండేవారు కదా? అప్పుడు ఏవో కారణాల చేత చేయలేకపోయినా ఇప్పుడైనా ఆ పని చేయవచ్చు కదా? నారా లోకేష్ ని మంత్రివర్గంలో తీసుకోదలిస్తే కాదనేదెవరు? ఆవిధంగా చేయకుండా ఆయనని ఎలివేట్ చేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నాల వలన ఆయనకి ఇంకా చెడ్డపేరే వస్తోందని ఆయన తండ్రి గుర్తించడం లేదా? నారా లోకేష్ ని రాహుల్ గాంధీ, కెటిఆర్ లతో పోల్చి చూసే పరిస్థితి ఎందుకు కల్పిస్తున్నారు? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.