ముఖ్యమంత్రి మనవడికే అంత సత్కారం చేశాడంటే.. తన ఉద్దేశం ఏమిటో చెప్పకనే చెప్పేసినట్టే! ఆ పిల్లోడు గుడికి వస్తే వచ్చి ఉండొచ్చు.. దర్శనం చేసుకుని వెళ్లింటే వెళ్లొండొచ్చు! పదేళ్ల వయసుండని ఆ బుడ్డోడిని అంతగా సత్కరించాడంటే.. పీజేఆర్ తనయుడు విష్ణు టీఆర్ఎస్ కు సైగ చేయడం గాక ఇంకేం అవుతుంది? అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట!
జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు విష్ణు. కాంగ్రెస్ తరపున ఓటమి ఎదురుకావడంతో.. ఈయన తెరాసలో చేరడం ఖాయమైందని చాన్నాళ్లుగా ఊహాగానాలున్నాయి. ఎలాగూ కాంగ్రెస్ నుంచి వచ్చిచేరే వాళ్ల కు కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో విష్ణు చేరిక లాంఛనమే అనే వార్తలు వచ్చాయి. విష్ణు సోదరి ఇది వరకే తెరాసలో చేరిపోయింది. ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసిన ఆమె ఇప్పుడు తెరాస తరపున కార్పొరేటర్ గా ఉన్నారు.
ఒక జూబ్లీ హిల్స్ లో తెరాసకు సరైన నేత లేడు కానీ.. ఇప్పటికే ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం నుంచి జంప్ చేసి తెరాస తీర్థం పుచ్చుకున్నాడు. దీంతోనే విష్ణుకు ఇబ్బంది. అయితే.. పీజేఆర్ తనయుడు కావున.. జూబ్లీహిల్స్ మాత్రమే కాకుండా.. ఆ చుట్టుపక్కలున్న వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయగలడు. ఖైరతాబాద్ నుంచి అనుకొంటే.. అక్కడ వచ్చే ఎన్నికల్లో ఈయన సోదరే పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గం విషయంలో క్లారిటీ వస్తే.. విష్ణు కూడా జంపింగ్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
అందుకే.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి వచ్చిన కేసీఆర్ మనవడికి విష్ణు ఆధ్వర్యంలో ప్రత్యేక సత్కారం జరిగిందనేది రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం.