హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఫోన్లనుకూడా ట్యాప్ చేయించిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఓటుకు నోటు కేసు బయటపడటానికి చాలా ముందునుంచే తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని, ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ఈ ట్యాపింగ్ చేయిస్తున్నారని పొన్నాల వరంగల్లో మీడియా సమావేశంలో చెప్పారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలనుంచి నాయకులను టీఆర్ఎస్లోకి తీసుకెళ్ళే సమయంలో ఈ ట్యాపింగ్లు జరిగాయని అన్నారు. ఫిరాయింపులన్నింటినీ కేసీఆరే చేయించారని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయనేది పేర్లు చెప్పటానికి పొన్నాల నిరాకరించారు. దీనిపై ఢిల్లీనుంచి తనకు పక్కా సమాచారం అందిందనిమాత్రం చెప్పారు. ప్రభుత్వంలో కొనసాగే నైతిక హక్కును కేసీఆర్ కోల్పోయారని అన్నారు. ఎన్నికలముందు చేసిన వాగ్దానాలను నెరవేర్చటంలో ఆయన విఫలమయ్యారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తక్షణమే రద్దుచేయాలని డిమాండ్ చేశారు.