జనసేన పార్టీ ఇంకా సజీవంగా ఉందని చాటి చెప్పేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నడూ ఎటువంటి ప్రయత్నమూ చేయకపోయినా, ఆయన అభిమానులు మాత్రం జనసేన ఉనికిని చాటే ప్రయత్నాలు అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నారు. రాజధాని భూసేకరణ సమయంలో వారు చేసిన హడావుడిని అందరూ చూశారు. ఆ తరువాత మళ్ళీ ఇన్నాళ్ళకి తమ పార్టీ ఉనికి చాటుకొంటూ విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆ పార్టీ కార్యకర్తలు ఎంపి మరియు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కంబంపాటి హరిబాబుకి నిన్న ఒక వినతి పత్రం సమర్పించారు. ఈనెల 18 నుంచి ప్రారంభం అయ్యే పార్లమెంటు సమావేశాలలో దాని కోసం ఆయన ఒక ప్రైవేట్ బిల్లుని ప్రవేశపెట్టాలని వారు వినతిపత్రం ద్వారా కోరారు. రైల్వేజోన్ ఒక్కటే కాకుండా ప్రత్యేక హోదా గురించి కూడా కేంద్రప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తేవాలని వారు తమ వినతి పత్రంలో కోరారు.
తన అభిమానులు జనసేన కార్యకర్తలుగా చెప్పుకొంటూ ఎంపిని కలిసి వినతి పత్రం ఇస్తున్న సంగతి పవన్ కళ్యాణ్ కి తెలుసో లేదో? ఒకవేళ తెలిసి ఆయన ప్రోత్సాహంతోనే ఇచ్చి ఉండి ఉంటే అది ఆయన డిమాండ్ లేదా అభిప్రాయంగానే భావించవలసి ఉంటుంది కనుక దానికి చాలా ప్రాధాన్యత ఏర్పడుతుంది లేకుంటే దానికి ఎటువంటి ప్రాధాన్యత ఉండబోదు. మన ప్రజా ప్రతినిధులు ఈ హామీల గురించి ఆలోచించడం మానుకొన్నప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈవిధంగా వారికీ తమ బాధ్యతని గుర్తు చేయడం అభినందనీయమే. అలాగే వారు తమ హీరో పవన్ కళ్యాణ్ కి కూడా తన బాధ్యతని గుర్తుచేసినట్లే భావించవచ్చు.
అయితే రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలకి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆ హామీలని అమలుచేయించుకోవాలనే ఆసక్తి, పట్టుదల లేనప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక వినతి పత్రం ఇస్తే వారిలో చలనం వస్తుందని ఆశించలేము. అయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేసింది. రైల్వేజోన్ ఏర్పాటు చేసే ఉద్దేశ్యం లేదని కూడా స్పష్టం అయ్యింది. కనుక ఈ రెంటిపై తాడోపేడో తేల్చుకోవాలంటే దానికి రెండే మార్గాలు కనిపిస్తున్నాయి. 1. పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి వాటి కోసం కేంద్రప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టడం. 2. భాజపాతో తెదేపా తెగతెంపులు చేసుకోవడానికి సిద్దపడటం. ఆ రెండూ సాధ్యం కావు కనుక హామీల అమలు కూడా సాధ్యం కాకపోవచ్చు.