ఏ ముహూర్తాన ‘అల్లరి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచీ… అల్లరి చేస్తూనే ఉన్నాడు నరేష్. ఒకటా రెండా.. ఏకంగా 50 సినిమాలతో నవ్వించాడు. ఇంకా నవ్విస్తూనే ఉన్నాడు. నరేష్ సినిమాకెళ్తే కనీసం కాసేపయనా కితకితలు పెట్టుకోకుండా నవ్వడం గ్యారెంటీ అనే భరోసా కల్పించాడు. సినిమా సినిమాకీ తన మార్కెట్ పెంచుకొంటూ వచ్చాడు. అయితే సుడిగాడు తరవాత నరేష్ సుడేం బాలేదు. వరుసగా అన్నీ ఫ్లాపులే. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఫలితం ఉండడం లేదు. అందుకే కాస్త విరామం తీసుకొని ఈసారి ‘సెల్ఫీరాజా’ గా కామెడీ చేయడానికి రెడీ అయ్యాడు. మరికొద్ది గంటల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సెల్ఫీరాజా నరేష్‌తో ‘తెలుగు 360’ జరిపిన చిట్ చాట్ ఇది..
* హాయ్ నరేష్..
– హాయ్…
* ఈమధ్య సెల్ఫీలు తెగ దిగుతున్నారు.. ఈ పిచ్చి మీక్కూడా అంటేసుకొందా?
– నిజం చెప్పాలంటే నాకు సెల్ఫీ అంటే అంతగా ఇష్టం ఉండదు. కానీ ఈ సినిమా కోసం మాత్రం దాదాపు మూడు వేల సెల్పీల వరకూ దిగాల్సొచ్చింది. సెల్ఫీ కాంటెస్ట్ కూడా ఒకటి పెట్టాం. దాంతో తప్పలేదు.
* మీరు బాగా మోజు పడి తీయించుకొన్న సెల్ఫీ ఏది?
– ఇప్పటి వరకూ లేదండీ… చెప్పా కదా సెల్ఫీ అంటే ఇష్టం ఉండదని.
* కానీ మీతో సెల్ఫీ దిగాలని చాలామంది కి ఉంటుంది కదా?
– అది నా అదష్టం. కాకపోతే.. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు అడిగేస్తున్నారు. అదే కాస్త ఇబ్బంది కలిగిస్తోంది. మొన్నోసారి సినిమా చూద్దామని థియేటర్‌కి వెళ్లా. ఇంట్రవెల్లో టాయ్లెట్లో దూరితే.. అక్కడ ఓ అభిమాని సెల్పీ అడిగాడు. అలాంటి సెట్యువేషన్ ఎదురైతే కంగారు కంగారు గా ఉంటుంది కదండీ.. (నవ్వుతూ)
*సెల్ఫీ రాజా ఎలా ఉండబోతున్నాడు?
–ట్రయిలర్ చూశారుగా.. అది శాంపిల్ మాత్రమే. మిమ్మల్ని రెండుగంటల పాటు హాయిగా నవ్వించే సన్నివేశాలు, డైలాగులు ఇందులో చాలా ఉన్నాయి. చూసినంత సేపు.. బయట ప్రపంచాన్ని మర్చిపోవడం ఖాయం.
* చెప్పను బ్రదర్.. డైలాగ్‌తో మళ్లీ బన్నీ అభిమానుల్ని కంగారు పెట్టినట్టున్నారు..
–భలేవారండీ బాబూ. అదేం కాదు. అది సరదాగా చేసిన ప్రయత్నమే. ఈ సినిమా చూస్తే ఆ డైలాగ్ అక్కడ ఎందుకు వాడామో మీకు బాగా అర్థమవుతుంది. అల్లు అర్జున్ నాకు మంచి ఫ్రెండ్. తనని కించ పరిచేలా నేనేదీ చేయను. రేపు తాను ఈ సినిమా చూసినా.. ఆ సీన్ చూసి హాయిగా నవ్వుకొంటాడు.
* ఆమధ్య విజయ్‌మాల్యాతో సెల్పీ దిగారు.. ఎక్కడ దొరికాడు?
– అదంతా గ్రాఫిక్స్ మాయ. ఆయన్ని నేను కలవలేదు. ఆరోజుల్లో విజయ్‌మాల్యా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఎక్కడ చూసినా అతని గొడవే. అందుకే సరదాగా ఆ పేరు, ఫొటో వాడుకొన్నాం. అంతకు మించ ఆయనకూ నాకూ ఎలాంటి సంబంధం లేదు.
* ట్రైలర్ చూస్తుంటే మీరు రకరకాల గెటప్పుల్లో కనిపిస్తున్నారు.. ఏంటి విషయం?
–తన సెల్పీల పిచ్చి వల్ల హీరో ఓ ప్రమాదంలో పడతాడు. దాన్నించి బయటపడ్డానికి ఎవ్వరికీ కనిపించకుండా తిరుగుతుంటాడు. అందుకే అన్ని మారు వేషాలు వేయాల్సివచ్చింది. ప్రతీ గెటప్ కామెడీ పండించిందే. అంతే తప్ప.. నేనేదో అపరిచితుడ్ని అయిపోవాలని కాదు.
* సుడిగాడు తరవాత సరైన సినిమా పడలేదు..
–అవునండీ. వరుసగా ఏడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దానికి పూర్తి బాధ్యుడ్ని నేనే. మంచి కథలు ఎంచుకొన్నా సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. లడ్డూబాబు లాంటి సినిమాలతో ప్రయోగం చేశాను. జనాలకు నచ్చలేదు. ఫ్లాప్ అయినా.. నా వంతు ప్రయత్నం నేను చేశానన్న సంతృప్తినాకుంది. అందుకే ఫ్లాపులు పెద్దగా బాధపెట్టలేదు. దాన్నుంచి చాలా నేర్చుకొన్నా.
* మీ డైరెక్షన్లో సినిమా ఎప్పుడు?
–కనీసం రెండేళ్లయినా పడుతుంది. ఎందుకంటే ఇటు నటిస్తూ అటు దర్శకత్వం వహించడం చాలా కష్టం.
* మీరు దర్శకత్వం వహించే సినిమాలో మీరే హీరోనా?
–లేదండీ. మరో హీరోతో చేస్తా. ఎందుకంటే నేనే హీరో అయితే నామీద ప్రేమ ఎక్కువగా పెరిగిపోతుంది. నాకిష్టమొచ్చినట్టు సీన్లు మార్చేసుకొంటా. మరో హీరో అయితే ఆ మీటర్ కరెక్ట్ గా తెలుస్తుంది.
* ఎలాంటి కథతో సినిమా తీస్తారు?
–7 బై జీ బృందావన కాలనీ లాంటి కథలతో సినిమాలు చేయాలని వుంది. బేసిగ్గా నాకు అలాంటి సినిమాలంటే చాలా ఇష్టం.
* సొంత బ్యానర్లో సినిమా ఎప్పుడు?
– చూడాలి. అన్నయ్యా.. నేను కలసి ఓ సినిమా చేద్దామనుకొంటున్నాం. బహుశా అది సొంత బ్యానర్లోనే ఉంటుంది.
* ఓకే… ఆల్ ద బెస్ట్
– థ్యాంక్యూ…