బ్యాంకులని మోసం చేసి లండన్ పారిపోయిన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాపై కోర్టు ధిక్కరణ నేరం క్రింద చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 17 బ్యాంకులు కలిసి గురువారం సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాయి. దానిపై జూన్ 18న విచారణ చేపడతామని సుప్రీం కోర్టు తెలియజేసింది.
బ్యాంకులకి చెల్లించవలసిన రూ.9,000 కోట్లను రెండు మూడు వాయిదాలలో చెల్లిస్తానని మొదటి వాయిదాలో రూ.4,000 కోట్లు చెల్లిస్తానని విజయ్ మాల్యా చేసిన ప్రతిపాదనని బ్యాంకులు తిరస్కరించాయి. అప్పుడు సుప్రీం కోర్టు విజయ్ మాల్యాని తన ఆస్తుల వివరాలు తెలియజేయవలసిందిగా ఆదేశించింది. అందుకు ఆయన అంగీకరించినప్పటికీ ఇంతవరకు ఆ వివరాలు సుప్రీం కోర్టు సమర్పించ లేదు. ఆయనని వెనక్కి రప్పించేందుకు ఈడి చేసిన ప్రయత్నాలు కూడా విఫలం కావడంతో, ఇక చేసేదేమీ లేక బ్యాంకులు ఈ ఉపాయంతో ఆయనని వెనక్కి రప్పించాలని భావిస్తున్నట్లున్నాయి. కోర్టు ధిక్కార నేరం క్రింద అయనకి సుప్రీం కోర్టు ఒకవేళ అరెస్ట్ వారెంట్ జారీ చేసినప్పటికీ, బహుశః ఆయనని భారత్ రప్పించడం సాధ్యం కాకపోవచ్చు. భారత ప్రభుత్వం గట్టిగా పట్టుబట్టి ప్రయత్నిస్తే తప్ప ఆయనని వెనక్కి రప్పించడం సాధ్యం కాదు.
గత మూడు నాలుగేళ్ళుగా తీవ్ర ఆర్ధిక సమస్యలని ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా విదేశాలకి పారిపోయే అవకాశం ఉందని అప్పులు ఇచ్చిన బ్యాంకులకి, ప్రభుత్వానికి, ఈడికి, నిఘా వర్గాలకి తెలియదంటే నమ్మలేము. ఆయన విదేశానికి పారిపోయిన తరువాత హటాత్తుగా మేల్కొన్నట్లుగా ఆయన తమని మోసం చేసి పారిపోయాడని అందరూ గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఆయనపై చాలా కటినమైన చర్యలు తీసుకోవలసిన కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ, “అప్పులు తీర్చేసి గౌరవం నిలుపుకొంటే బాగుంటుంది కదా..కోరుండి సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు?” అంటూ చాలా సున్నితంగా విజయ్ మాల్యాని హెచ్చరించడం గమనిస్తే, ఆయనని వెనక్కి తిరిగి రప్పించి చట్ట ప్రకారం శిక్షించాలానే ఉద్దేశ్యం ప్రభుత్వానికి కూడా లేవని స్పష్టం అవుతోంది. మరి అటువంటప్పుడు ఆయనని సుప్రీం కోర్టు మాత్రం ఆయనని స్వదేశం రప్పించగలదా? ఏమో? చూడాలి.