పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియడంతో ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. జూలై 21 నుండి ఆగస్ట్ 13 వరకు అంటే నేటి వరకు సాగిన సమావేశాలలో ప్రజాసమస్యలపై కేవలం ఆరు ప్రశ్నలు మాత్రమే అడిగారు. కేవలం నాలుగు సమస్యల గురించి మాత్రమే కొద్ది సేపు సభలో చర్చ జరిగింది. మిగిలిన అన్ని రోజులు కాంగ్రెస్ మిత్ర పక్షాల చేసిన రభసతోనే సభా సమయం అంతా వృధా అయిపోయింది. ఈసారి సమావేశాలలో 34 పని గంటలు నష్టపోయామని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. కాంగ్రెస్ మిత్రపక్షాలు చేసిన ఈ ఆందోళన కారణంగా వస్తు సేవల బిల్లుతో సహా అనేక ముఖ్యమయిన బిల్లులపై చర్చ జరగలేదు, ఆమోదం కూడా పొందలేకపోయాయి. ముఖ్యంగా వస్తు సేవల బిల్లు ఆమోదం పొందకపోవడంతో మోడీ ప్రభుత్వం తీవ్ర నిరాశకు గురయింది.
కాంగ్రెస్ పార్టీ తన బలప్రదర్శన కోసం పార్లమెంటును వేదికగా చేసుకొని ప్రజా సమస్యలపై ఎటువంటి చర్చ జరగనీయకుండా అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని మంటగలిపిందని బీజేపీ ఆరోపించింది. కానీ మొగుడ్ని కొట్టి బజారుకెక్కినట్లుగా పార్లమెంటు సమావేశాలు జరగకపోవడానికి మోడీ ప్రభుత్వ మొండి పట్టుదలే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. వ్యాపం కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, లలిత్ మోడీ కేసులో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మరియు రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందర రాజేల రాజీనామాలకు కాంగ్రెస్ పట్టుబట్టడంతో మొదలయిన ప్రతిష్టంభన చివరి వరకు కూడా కొనసాగడంతో పార్లమెంటు సమావేశాలలో ఎటువంటి చర్చ జరపకుండానే ముగించవలసి వచ్చింది.
ఈసారి పార్లమెంటు సమావేశాలు జరపకుండా అడ్డుకోవాలని తమ పార్టీ అధిష్టానం ముందే నిర్ణయించుకొందని కాంగ్రెస్ ఎంపీ శశీ ధరూర్ సమావేశాలు మొదలయిన రోజే బయట పెట్టడంతో కాంగ్రెస్ కుట్ర బయటపడింది. తమ వ్యూహాన్ని ముందే బయటపెట్టేసినందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆయనకు చివాట్లు పెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ ముందే అనుకొన్న విదంగా పార్లమెంటు సమావేశాలు జరగకుండా అడ్డుపడిందని స్పష్టమయింది. పార్లమెంటు సమావేశాలు అడ్డుకొనేందుకే కాంగ్రెస్ పార్టీ లలిత్ మోడీ, వ్యాపం కేసులను సాకుగా చూపి గొడవ చేసిందని అర్ధమవుతోంది. ఈవిధంగా కాంగ్రెస్ పార్టీ తన బలప్రదర్శన కోసం పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేయడం ద్వారా మోడీ ప్రభుత్వంపై పైచేయి సాధించినట్లు గర్వంగా భావిస్తోందేమో, కానీ యావత్ దేశ ప్రజలు కాంగ్రెస్ తీరును చూసి అసహ్యించుకొంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు అంటే ఎటువంటి గౌరవం లేదని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు ఆమోదింపజేసుకొనే సమయంలోనే రుజువయింది. ఈ సమావేశాలలో మళ్ళీ మరో మారు నిరూపించి చూపించింది.