సరిగ్గా ఏడాదిక్రితం గోదావరి పుష్కరాలు ప్రారంభమైన (జులై14) రోజున రాజమహేంద్రవరంలో పుష్కరఘాట్ వద్ద తొక్కిసలాటలో 28 మంది మరణించారు. ఆ సంఘటన పట్ల అప్పట్లో ముఖ్యమంత్రి ఉద్వేగానికి లోనయ్యారు. మృతుల కుటుంబాలకు భారీగా ప్రభుత్వ పరిహారాన్ని ప్రకటించారు. పుష్కరాలు ముగిశాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. చర్యలేమీ లేవుగాని స్వయంగా ముఖ్యమంత్రే అధికారులకు సన్మానాలు చేశారు. తరువాత కొంతకాలానికి ఈ సంఘటనపై న్యాయవిచారణకు ఏకసభ్య కమీషన్ ను నియమించారు.
దుర్ఘటన జరిగినరోజున ముఖ్యమంత్రి సకుటంబంగా పుష్కరఘాట్ లో పుష్కరస్నానాలు చెశారు. ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ బిల్టింగ్ లో భాగంగా చంద్రబాబు మీద ప్రధాన ఫోకస్ తో ఒక డాక్యుమెంటరీ నిర్మించే కాంట్రాక్టుని నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ తీసుకుంది. మరో యాంగిల్ లో జనం మధ్య వున్న నాయకుడిగా చంద్రబాబుని చూపించడానికి దర్శకుడు బోయపాటి టీమ్ కూడా షూటింగ్ చేస్తున్నారు. షూటింగుల వల్లనో, ముఖ్యమంత్రి పుష్కర స్నానం వల్లనో, ఆయన స్నానం ముగించుకుని వ్యాన్ ఎక్కి లోపలే 50 నిమిషాలు వుండిపోవడవల్లనో….ఏమైనా గాని ముఖ్యమంత్రి రావడానికి ముందే పుష్కరఘాట్ మూసివేశారు. ఆయన వెళ్ళిపోయాకే గేటు తీశారు. ఈ మధ్య కాలం రెండున్నర గంటలు…. కదలని క్యూలో వందల వందల మంది కిక్కిరిసిపోతూండగా గేటు తీసిన వెంటనే వరద ప్రవాహంలా క్యూ కదిలింది. ముందున్న వాళ్ళు ని వెనుక వచ్చిన వాళ్ళు తొక్కేశారు…
ఆరోజు జరిగిన సంఘటన ఇదే…ఇది మన చిన్నతనంలో విన్న ”ఎండని చేపకథే”
పోలీసూ పోలీసు జనాన్ని ఎందుకు కంట్రోలు చెయ్యలేదు? ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో నాకేం తెలుసు? పైన ఉన్న చెప్పలేదు! పైన వున్నవాళ్ళూ పైన వున్న వాళ్ళూ ఎందుకు జనాన్ని వొదిలేశారు? కింద ఎందరున్నారో పై నుంచి ఎందరు వస్తారో జనాన్ని పంపాలో వద్దో ఎస్సై గారు చెప్పలేదు! ఎస్సై గారూ ఎస్సై గారూ వాళ్ళకి ఆసంగతి చెప్పలేదు? అలా చెప్పాలని సిఐ గారు చెప్పలేదు! సిఐగారూ సిఐగారూ ఎందుకు చెప్పలేదు? సిఎంగారి ఫామిలీ స్నానాలు అయ్యాక చూడవచ్చని ఊరుకున్నాను! అక్కడికీ స్నానాలు ఎప్పుడౌతాయీ అని డిఎస్పీ గార్నీ అడిగాను డిఎస్ప్సీ గారు ఇదేమాట ఎస్పీగార్నీ అడిగారు…ఎస్పీగారు సీరియస్ గా చూశారు…సరే జరిగేది జరక్కమానదని లాఠీలు పట్టుకుని డ్యూటీలు చేస్తూ వుండిపోయాము… అని వివరంగా చెప్పేశాక ప్రమాదానికి కారణమేమిటో కారకులేవరో అర్ధమైపోయింది.
అయినా సరే బాధ్యులపై చర్యలు తప్పవు అని ముఖ్యమంత్రి ప్రకటించేశారు. ఆయనమీద ఆయనే ఎలా చర్యలు తీసుకుంటారు అని విషయం అర్ధమైన వారు జోకులు వేసుకున్నారు.
ఊహించినట్టుగానే కమీషన్ విచారణకు ప్రభుత్వ ప్రతినిధి అయిన జిల్లాకలెక్టర్ అరుణకుమార్ సహకరించలేదు. కమీషన్ కు అందజేసిన అఫిడవిట్ లో తొక్కిసలాటకు యాత్రికులే కారణమని పేర్కొన్నారు…మరి 1500 కోట్ల రూపాయల ఖర్చయిన ఈ భారీ ఈవెంటులో ప్రభుత్వ యంత్రాంగం యాత్రీకుల భద్రతా సౌకర్యాలను వొదిలేసి గాడిదలను కాస్తోందా అని కమీషన్ అడిగి వుండేదేనేమో! పొడిగించిన ఆరు నెలల గడువు ముగిసిపోవడంతో మళ్ళీ గడువు పెరుగకపోతే తాను ఉనికిలో లేనట్టే కాబట్టి కమీషన్ కు కాని, విచారణలో ప్రజలు కాని కలెక్టర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశమే రాలేదు.
పుష్కరఘాట్ వద్ద సిసికెమేరాలు తీసిన వీడియో ఫుటేజి చూస్తే పరిస్ధితి అర్ధమై ప్రజల పక్షాన ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు, న్యాయవాది, ముప్పాళ్ళ సుబ్బారావు, పార్లమెంటు మాజీ సభ్యుడు వుండవల్లి అరుణ్ కుమార్ కమీషన్ ను కోరారు. అయితే, వీడియోఫుటేజి ఏమైందో తెలియదని జిల్లా కలెక్టర్ అఫిడవిట్ లో కమీషన్ కు తెలియజేశారు.
వీడియో ఫుటేజి మాయమైపోవడానికి కారకులెవరో తెలుసుకోడానికి కూడా కలెక్టర్ ప్రయత్నమే చేయలేదంటే ”ఆ వ్యవహారం జిల్లా కలెక్టర్ కి అందనంత ఎత్తున వుందని” ఎవరైనా అర్ధంచేసుకోవచ్చు.
తొక్కిసలాటలో 28 మంది మరణించిన సంఘటన ఎవరో కావాలని చేసింది కాదు. అయితే ”ఇందులో ప్రధాన బాధ్యత చంద్రబాబుదే ఇది అందరికీ తెలిసిందే. ఇందుకు క్షమాపణలు చెప్పి ఇకముందు అన్నిజాగ్రత్తలూ తీసుకుంటామని ప్రకటించి వుంటే సరిపోయేది” అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు వ్యాఖ్యానించారు.
మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడంతోనే ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. దుస్సంఘటనకు యాత్రికులే కారణమని ఏమాత్రం సిగ్గూ సంకోచాలు లేకుండా జిల్లా యంత్రాంగమే కమీషన్ కు విన్నవించకుంది.
అయినా, ప్రజల పక్షాన ముప్పాళ సుబ్బారావు, రౌతు సూర్యప్రకాశరావు, మీసాల సత్యనారాయణ, జక్కంపూడి విజయలక్ష్మి మొదలైన వేర్వేరు పార్టీల నాయకులు 28 గులాబీలతో పుష్కరఘాట్ కి వెళ్ళి మృతులను స్మరించుకుంటూ 28 కొవ్వొత్తులు వెలిగించారు. మరణించనవారికి గోదావరి నదిలో తర్పణాలు వొదిలారు.