తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై జరుగుతున్న రగడ అందరికీ తెలిసిందే. అక్కడ ప్రధాన సమస్య నిర్వాసితుల ఆందోళనలు. ఆ ప్రాజెక్టుని నిర్మించాలని ప్రభుత్వం చాలా పట్టుదలతో ఉంది కనుక వారి సమస్యలని ఏదో ఒకవిధంగా పరిష్కరించక మానదు. ప్రాజెక్టు కట్టకా మానదు. కానీ అసలు ఆ ప్రాజెక్టు అవసరమే లేదని వాదిస్తున్నారు గోదావరి జలాల వినియోగ ఫోరం చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి. హర్యానా రాష్ట్రంలో ఎటువంటి రిజర్వాయర్లు నిర్మించకుండానే జవహార్ లాల్ నెహ్రూ ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా అక్కడి ప్రభుత్వం ఆరు లక్షల ఎకరాలకి నీళ్ళు అందిస్తోందని, ఆ విధానం గురించి తమ ఫోరం సభ్యులు స్వయంగా అక్కడికి వెళ్లి అధ్యయనం చేసి వచ్చామని మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. నీటి పారుదల రంగంలో నిపుణుడు టి.హనుమంత రావు వంటివారు మల్లనసాగర్ ప్రాజెక్టుకి రిజర్వాయర్ అవసరం లేదని చెపుతున్నప్పటికీ, తెలంగాణా ప్రభుత్వం మొండిగా నియంతలాగా వ్యవహరిస్తోందని శశిధర్ రెడ్డి విమర్శించారు.
కధ ఇంతవరకు వచ్చిన తరువాత శశిధర్ రెడ్డి చెపుతున్న ఈ సలహాని తెలంగాణా ప్రభుత్వం స్వీకరిస్తుందని భావించలేము. కానీ మల్లన్నసాగర్ ప్రాజెక్టుకి అసలు రిజర్వాయరే అవసరం లేదనే ఆయన వాదన ఆలోచింపదగినదే. అ విధానం వలన రాష్ట్రానికి ఖర్చు తగ్గి, గ్రామాలు ముంపుకి గురికావనుకొంటే, తెలంగాణా ప్రభుత్వం తన పంతాన్ని, భేషజాన్ని పక్కనపెట్టి దానిలో లాభనష్టాలు, సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించడం మంచిదే. ఆ విధానం మంచిదని తేలితే మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం రిజర్వాయర్ నిర్మించాలనే తన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకొంటే ప్రజలలో దాని గౌరవం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు.
మర్రి శశిధర్ రెడ్డి చెప్పిన ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా చాలా ఉపయోగపడవచ్చు. నీటిని నిలువ చేసుకోనేందుకు రిజర్వాయర్ నిర్మించకుండానే వేల కోట్లు దుబారా చేసి రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమని నిర్మించిందని, దేశంలో ఎక్కడా ఈవిధంగా ప్రాజెక్టులు నిర్మించబడలేదని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పదేపదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విమర్శిస్తుండటం, ఆయన వేస్తున్న ఈ ప్రశ్నకి నేరుగా సమాధానం చెప్పుకోలేక తెదేపా నేతలు ఆయనపై ఎదురుదాడి చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక మర్రి శశిధర్ రెడ్డి కనుగొని చెపుతున్న ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తమ నిర్ణయాన్ని సమర్ధించుకొనేందుకు పనికివస్తుంది. అయితే ఇటువంటి ప్రాజెక్టులు మొదలుపెట్టే ముందు నిపుణుల చేత ఈవిధమైన అధ్యయనాలు చేయించి ఉండి ఉంటే, ప్రతిపక్షాల విమర్శలకి తగిన విధంగా జవాబు చెప్పుకొనే అవకాశం ఉండేది కదా!