ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ సంస్ధలు చేసే తప్పులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత ఎలా తీసుకుంటుంది? సింగపూర్ సంస్ధలు చేసే అప్పులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా గ్యారెంటీ ఇస్తుంది? ఎఫ్ ఆర్ బి ఎం (పిస్కల్ రెస్పాన్స్ బిలిటీ అండ్ బడ్జెట్ మేనేజిమెంట్) నియమాలకు ఈ గ్యారెంటీ అవరోధం కాదా?
ఈ అభ్యంతరాలు, ప్రశ్నలతో రాష్ట్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రశ్నలతో ఒక నోట్ పంపారని తెలిసింది.”స్విస్ చాలెంజ్” విధివిధానాలను ఖరారు చేయడానికి ఏర్పాటైన హైపవర్ కమిటీ చైర్మన్ అయిన ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ నోట్ కి సమాధానం ఇవ్వవలసి వుంది.
అంటే ఇది ఆర్ధికశాఖ కు ఆర్ధికమంత్రే సమాధానం చెప్పుకోవలసిన ఇరకాటమైన పరిస్ధితి. పారదర్శకంగా లేని అవినీతి ఆరోపణలకు అవకాశం వున్న ”స్విస్ చాలెంజ్” టెండరింగ్ అంటే అధికారులు భయపడుతున్నారు. ఈ విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఫోన్ లో మాట్లాడుకుని ఖరారు చేశారు. ఇది మినిట్స్ లో రాసి ప్రతి పేజీమీదా చంద్రబాబుతో హైపవర్ కమిటీ సంతకాలు చేయించింది. ఆ మినిట్స్ అమలు చేయడానికి హైపవర్ కమిటీ ప్రొసీడింగ్స్ మొదలు పెట్టగానే ఆర్ధిక శాఖ నుంచి ఈ మేరకు అభ్యంతరాలు వచ్చాయి.
“మేము సలహా ఇచ్చేవాళ్ళమే. అంతిమ నిర్ణయం ప్రభుత్వానిదే! స్విస్ చాలెంజి ఎలాగూ ఆగదు…అయినా జైలుకి వెళ్ళిన ఐఎస్అధికారి శ్రీలక్ష్మి ని చూశాక అయినా మమ్మల్ని మేము కాపాడుకోవాలి కదా” అని ఒక అధికారి ఈ వివరాలు చెప్పారు.