హైదరాబాద్: ఢిల్లీలో పాశవికంగా అత్యాచారానికి గురయ్యి మరణించిన నిర్భయ, గుంటూరులో ర్యాగింగ్ పాలిట పడి ఆత్మహత్య చేసుకున్న రిషిత…ఇద్దరిలో అనేక పోలికలు కనిపిస్తాయి. ఇద్దరూ మృగాళ్ళ అఘాయిత్యాలకు బలయ్యారు. ఇద్దరూ మరణానికి ముందు సామాన్య యువతులే. మరణానంతరంమాత్రం వారి పేర్లు ఒక్కసారిగా ఇంటింటా మార్మోగాయి…అందరి నోళ్ళలో నానాయి. వారి మరణం ప్రభుత్వాలకేకాక సమాజంలో పలుచోట్ల మేలుకొలుపుగా మారింది. చట్టాలుకూడా మార్చబడ్డాయి.
నిర్భయగా మీడియాలో పిలవబడ్డ జ్యోతిసింగ్ పాండే 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి దారుణ అత్యాచారానికి గురయింది. తన మిత్రుడితో కలిసి ఇంటికెళ్ళటానికి ఒక బస్సెక్కగా, దానిలో ఉన్న ఆరుగురు దుండగులు ఆమెపై అత్యాచారం చేసి రక్తం ఓడుతున్న ఆమెను, ఆమె మిత్రుడిని బస్సులోనుంచి రోడ్డుపైకి విసిరేసిపోయారు. దారిన పోయేవారెవరూ పట్టించుకోలేదు. చివరికి పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ వచ్చి వారిని ఆసుపత్రిలో చేర్చింది. ఆ తర్వాతమాత్రం ఆ ఘటనపై దేశప్రజలలో అనూహ్య స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా కొన్ని రోజులపాటు ఆ ఘటన పట్టికుదిపేసింది. ఢిల్లీనగరమైతే ఆందోళనలతో అట్టుడికింది. గల్లీనుంచి ఢిల్లీదాకా ఆ ఘటనపై చర్చ జరిగింది. అత్యాచార ఘటనలపై శిక్షలను కఠినంచేస్తూ నిర్భయపేరుతో పార్లమెంట్లో ప్రత్యేకచట్టం చేశారు. దేశంలో ఎన్నో అత్యాచార ఘటనలు జరుగుతున్నప్పటికీ ఆ ఘటనకు వచ్చిన స్పందనమాత్రం నభూతో నభవిష్యతి. బ్రతకాలని ఎంతో ఆశను వ్యక్తంచేసి, 13 రోజులు మృత్యువుతో పోరాడిన తర్వాత డిసెంబర్ 29న సింగపూర్ ఆసుపత్రిలో నిర్భయ మరణించింది.
ఇక వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఆర్కిటెక్చర్ కాలేజిలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో చేరింది. కొందరు సీనియర్లు చేసిన ర్యాగింగ్, వేధింపులతో తీవ్రమనస్తాపానికి గురై గతనెల 14న హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తెలుగు రాష్ట్రాలు రెండింటిలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. రిషిత ఉదంతంపై మనసున్న ప్రతివారూ నొచ్చుకున్నారు. ఇరవై ఏళ్ళుకూడా నిండని ఆ అమ్మాయి జీవితంలో ఏమీచూడకుండానే అర్థంతరంగా తనువుచాలించిందని బాధపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ర్యాగింగ్ నిరోధంకోసం నిర్భయలాగా ఒక చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించింది. జేఎన్టీయా పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలో సీసీటీవీ కెమేరాలు అమర్చాలని, యాంటీ రాగింగ్ స్క్వాడ్లను ఏర్పాటుచేయాలని వైస్ ఛాన్సలర్ ఆదేశించారు. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జీఎస్ఎన్ రాజుకూడా తమ అనుబంధ కళాశాలలకు ఇదే రకమైన ఆదేశాలు జారీ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ కళాశాలలన్నింటిలో యాంటీ రాగింగ్ కమిటీలు, స్క్వాడ్లు, కౌన్సిలింగ్ సెల్లు ఏర్పాటు చేయాలని సర్క్యులర్ జారీ అయింది.
నిర్భయ, రిషితలు తాము ప్రాణాలు కోల్పోయినా సమాజంలో ఎన్నో సానుకూల మార్పులకు కారణమయ్యారు. వారి అసాధారణ మరణాలు సాటి మహిళలకోసం జరిగిన బలిదానాలుగా మారాయి. అవి వృథాకావు. మరణానికి ముందు సామాన్యయువతులైన వారు ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయి అమర నారీమణులయ్యారు.