కాపులకి రిజర్వేషన్లు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిసి కమీషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ రాష్ట్రంలో 13 జిల్లాలలో పర్యటించి కాపుల ఆర్ధిక, సామాజిక, రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేయవలసి ఉంది. అయితే కొన్ని సంఘాల నుంచి వినతి పత్రాలు, పిర్యాదులు, అభ్యంతరాలు వస్తునందున ఇంకా జిల్లా పర్యటనలు మొదలుపెట్టలేదని తెలుస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాలకి చెందిన కాపు సంఘాల నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు నరహరిశెట్టి శ్రీహరి, కాపు కార్పోరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామనుజయ్య తదితరులు నిన్న జస్టిస్ మంజునాథ్ ని కలిసి వినతి పత్రం ఇచ్చారు. వీలైనంత త్వరగా అధ్యయనం పూర్తి చేసి నివేదికని ఇవ్వాలని కోరారు.
ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు గమనిస్తే కాపులకి రిజర్వేషన్లు ఈయడాన్ని వ్యకిగతంగా ఆయనే వ్యతిరేకిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఆయన వారితో మాట్లాడుతూ “కాపులలో 95 శాతం మంది పేదలున్నారని మీరు చెపుతున్నారు. కానీ95 శాతం మంది అన్ని విధాల అభివృద్ధిచెందారని మరి కొందరు చెపుతున్నారు. వ్యాపారాలు, కాంట్రాక్టులు, నిర్మాణ రంగం, రాజకీయాలలో కాపులదే పై చెయ్యిగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాపుల అసలు పరిస్థితి ఏమిటో సాధికార సర్వేతో తెలుస్తుంది. దానికి అనుగుణంగానే నివేదికని తయారుచేస్తాను,” అని కుండబ్రద్దలు కొట్టినట్లు చెప్పారు.
ఆయన చెపుతున్న ఆ ‘సాధికార సర్వే’ అంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ‘స్మార్ట్ సర్వే’ అయినట్లయితే అయన స్వయంగా జిల్లాల పర్యటనలు చేసి కాపు ప్రజల స్థితిగతుల గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయబోవడం లేదని స్పష్టం అవుతోంది. వచ్చే ఎన్నికలలో తెదేపా విజయావకాశాలని తీవ్ర ప్రభావితం చేయగలదీ అంశం. అంతే కాదు ప్రస్తుతం ఇది రాష్ట్రంలో బీసిలకి, కాపులకి మధ్య చిచ్చు రగుల్చుతోంది కూడా. అటువంటి చాలా ముఖ్యమైన, సున్నితమైన అంశంపై జస్టిస్ మంజునాథ్ ఎటువంటి సర్వే నిర్వహించకుండానే తనని కలిసిన కాపు నేతల వద్దనే ఇటువంటి అభిప్రాయలు వ్యక్తం చేయడం చాలా విస్మయం కలిగిస్తుంది. సాధికార సర్వేపై ఆధారపడటం కంటే ఆయనే స్వయంగా జిల్లాలలో పర్యటించి కాపుల ఆర్ధిక, సామాజిక, రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేసి నివేదికని తయారుచేస్తే అది వాస్తవ పరిస్థితులని ప్రతిభింబించేదిగా ఉంటుంది కదా?