ఈరోజు ఒక పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాన్వాయిలో ఒక వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో జారిపోయింది. కానీ అదృష్టవశాత్తు అందులో ఉన్న ఆరుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ సమీపంలో బాగ్ డోగ్ర అనే కొండ ప్రాంతంలో రాష్ట్రపతి కాన్వాయ్ పయనిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆయనతో బాటు ఆయన కుమారుడు అభిజిత్, కుమార్త్ శర్మిష్ఠ ఉన్నారు. వారి కాన్వాయ్ వెనుకే రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాన్వాయ్ కూడా కదులుతోంది. ఒక కొండ మలుపు వద్ద రాష్ట్రపతి కాన్వాయ్ లో ఒక కారు అదుపు తప్పి లోయలోకి జారిపోయింది. ఈవిషయాన్ని రాష్ట్రపతి భవన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
రాష్ట్రపతి కాన్వాయ్ అంటే అత్యంత భద్రత ఏర్పాట్లు కలిగి ఉంటుంది. అటువంటి కాన్వాయ్ లో రాష్ట్రపతికి రక్షణగా నిలువవలసిన వాహనమే ఇటువంటి ప్రమాదంలో చిక్కుకోవడం చాలా ఆందోళన కలిగించే విషయమే. అదే ప్రమాదం రాష్ట్రపతి వాహనానికే జరిగి ఉండి ఉంటే..ఏమి జరిగి ఉండేదో ఊహించుకోవడమే కష్టం. అసలు అంత బారీ కాన్వాయ్ ఏర్పాటు చేసేదే అటువంటి ప్రముఖుల రక్షణ కోసం. దానికే ప్రమాదం జరిగితే ఎలా?