సుప్రీం కోర్టు దయతో నబం తుకి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని మళ్ళీ దక్కించుకొన్నప్పటికీ, దానిని నిలబెట్టేందుకు తగినంతమంది ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో ఆయన పరిస్థితి ఏక్ దిన్ కా సుల్తాన్ అన్నట్లు తయారయింది. గవర్నర్ కొంచెం సమయం ఇస్తే భాజపాతో చేతులు కలిపిన 29 మంది ఎమ్మెల్యేలలో కొంతమందినైనా మళ్ళీ తనవైపు త్రిప్పుకోవచ్చనుకొంటే, ఆయన సుప్రీం కోర్టు ఆదేశాలను చూపించి శనివారమే బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి గవర్నర్ తధాగత్ రాయ్ ని మరికొంత సమయం ఇమ్మని వేడుకొన్నా ఆయన అంగీకరించలేదు. రేపే తప్పనిసరిగా శాసనసభని సమావేశపరిచి బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ఇక్కడే ఊహించని నాటకీయ పరిణామం ఒకటి జరిగింది. ఇంత తక్కువ సమయంలో శాసనసభని సమావేశపరచడం సాధ్యం కాదని స్పీకర్ తేల్చి చెప్పారు. అందుకు సాంకేతిక కారణాలు చెప్పి ఉండవచ్చు కానీ అసలు కారణం మాత్రం ఆయన ముఖ్యమంత్రికి గట్టిగా మద్దతు ఇస్తుండటమే.
గవర్నర్ శాసనసభ నిర్వహించమని ఆదేశించారు. స్పీకర్ సాధ్యం కాదని చెపుతున్నారు. కనుక మళ్ళీ రాజ్యంగ సంక్షోభం ఏర్పడినట్లే భావించవచ్చు. ఒకవేళ తన ఆదేశాలని స్పీకర్ మన్నించకపోతే గవర్నర్ ఏమి చేయాలి? గవర్నర్ ఆదేశాలని స్పీకర్ మన్నించవలసిన అవసరం ఉందా లేదా? అనే రెండు ప్రశ్నలు తలెత్తాయి. గవర్నర్ ఆదేశాలని స్పీకర్ మన్నించవలసిన అవసరం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం శాసనసభని ఎప్పుడు సమావేశపరచాలో ఆయనే నిర్ణయించగలరు. సుప్రీం కోర్టు తాజా తీర్పులో కూడా శాసనసభ వ్యవహారాలలో గవర్నర్ ని తలదూర్చవద్దని సలహా ఇచ్చింది. కనుక రేపు అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ సమావేశం నిర్వహిస్తారా లేదా? నిర్వహించకపోతే అప్పుడు గవర్నర్ ఏమి చేస్తారు? అనే కొత్త సస్పెన్స్ మొదలయింది. ఒకవేళ అది స్పీకర్ పరిధిలో విషయమని భావించి గవర్నర్ ఏమీ చేయ(లే)కపోతే ప్రస్తుతానికి నబం తుకి ప్రభుత్వానికి గండం గడిచినట్లే. మరికొన్ని రోజులు అధికారయోగం ఉన్నట్లే భావించవచ్చు.