ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులకు ర్యాంకులు ఇవ్వబోతున్నారు. ఇందుకోసం సమగ్ర సర్వే చేయించారు. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబుకు ఐదో ర్యాంకు, కాదు కాదు 13వ ర్యాంకు వచ్చింది… గత రెండు మూడురోజులగా ఈ ఊహాగానాలు తెలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతున్నాయి. శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే అంతర్ రాష్ట్ర మండలి సమావేశంలో ఈ ఊహాగానాలు నిజమో కాదో తేలిపోతుంది.
నామమాత్రపు సర్క్యులేషన్ ఉన్న ఒక తెలుగు దినపత్రికలో రెండు రోజుల క్రితం ఒక కథనం ప్రచురితమైంది. దానికి ఆధారం ఏమిటో ఎవరికీ తెలియదు. అది ఊహాజనిత కథనమో లేక ప్రధాని కార్యాలయంలో విశ్వసనీయ వర్గాలు తెలిపిన సాధికారిక సమాచారమో తెలియదు. ఏదో జనాంతికంగా వినవచ్చిన మాటల ఆధారంగా అల్లిన కథనమా అనేది కూడా తెలియదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం మొదలైంది.
నిజంగా మోడీ సర్వే చేయించి ర్యాంకులను నిర్ణయించి ఉంటే, అసలు ఏమాత్రం ప్రాచుర్యం లేని పత్రిక విలేకరికి మాత్రమే ఆ సమాచారం ఎలా తెలిసిందో అర్థం కాదు. ఎన్నో జాతీయ మీడియా సంస్థలు, రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన పత్రికలు, న్యూస్ చానళ్లకు కూడా ఆ సమాచారం రాలేదు. మరి ఆ పత్రిక ప్రత్యేకత ఏమిటి, దానికి మాత్రం సమాచారం ఎలా వచ్చిందనేది అంతుపట్టదు. అది ఊహాజనిత కథనం కావచ్చని కొందరి అనుమానం.
అయితే ఈ కథనం కలకలం రేపిన మాట వాస్తవం. ఈ ర్యాంకుల గోల విని చంద్రబాబు ఆవేదన చెందారని, తాను చాలా కష్టపడుతున్నా తక్కువ ర్యాంకు ఇవ్వడం ఏమిటని తెగ ఇదవుతున్నారని మరికొన్ని మీడియా సంస్థలు కథనాలు వినిపించాయి. సరే, ముఖ్యమంత్రుల సమావేశానికి ఎలాగూ వీరిద్దరూ హాజరవుతారు. మోడీ అధ్యక్షతన జరిగే ఆ సమావేశంలో ర్యాంకుల ఊహాగానాలకు తెరపడుతుంది. నిజంగా ర్యాంకులు ఇస్తారా, ఇస్తే ఎవరికి ఏ ర్యాంకు వచ్చిందనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.