ఉగ్రవాదం పట్ల పాకిస్తాన్ తన రెండు నాల్కల ధోరణిని మళ్ళీ మరోసారి బయటపెట్టుకొంది. ప్రపంచ దేశాల చేత నిషేదింపబడిన హిజ్బుల్ ముజాహుద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ భారత్ భద్రతాదళాల చేతిలో హతమయితే, అతనిని కాశ్మీర్ పోరాటవీరుడని, భారత్ జవాన్లు పొట్టనబెట్టుకొన్నారని వాదిస్తూ కాశ్మీరీ ప్రజలకి సంఘీభావం తెలుపుతూ జూలై 19న దేశంలో బ్లాక్ డే పాటిస్తామని ప్రకటించింది. ఒక ఉగ్రవాది కోసం ప్రభుత్వమే అధికారికంగా బ్లాక్ డే పాటించడంతో పాకిస్తాన్ ఉగ్రవాదులకి పూర్తి మద్దతు ఇస్తోందని స్వయంగా లోకానికి చాటి చెప్పుకొన్నట్లయింది.
అదే సమయంలో ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తున్నామని ప్రకటించింది. ప్రధాన కార్యదర్శి విదేశాంగ ప్రతినిధి నసీఫ్ జకీరా మీడియాతో మాట్లాడుతూ, “పాకిస్తాన్ కూడా ఉగ్రవాద పీడిత దేశమే. అందుకే మేము కూడా ఉగ్రవాదంపై అలుపెరుగని పోరాటం చేస్తున్నాము. నైస్ నగరంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని మా ప్రభుత్వం గట్టిగా ఖండిస్తోంది. తమ ఆప్తులని కోల్పోయిన ఫ్రాన్స్ ప్రజలకి సానుభూతి తెలుపుతోంది,” అని చెప్పారు.
ఒకవైపు ఉగ్రవాది మరణానికి సంతాపం ప్రకటిస్తూనే, ఉగ్రవాదుల దాడిని ఖండించడం పాకిస్తాన్ కే చెల్లు. అక్కడ ఆయన ఈ సంతాప ప్రకటన చేస్తున్న సమయంలోనే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కుల్గాం జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ పై వేర్పాటువాదులు గ్రెనేడ్ తో దాడి చేశారు. ఆ దాడిలో ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడే మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాశ్మీర్ అల్లర్ల వెనుక పాక్ హస్తం ఉందని నిరూపించేందుకు ఈ గ్రెనేడ్ దాడే చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఏవిధంగా అంటే సామాన్య ప్రజల వద్ద గ్రెనేడ్స్ ఉండే అవకాశమే లేదు. పాకిస్తాన్ శిక్షణ, సహకారం పొందుతున్న వేర్పాటువాదులు, ఉగ్రవాదుల వద్ద మాత్రమే ఇటువంటి మారణాయుధాలు కలిగి ఉంటారు.
గత వారం రోజులుగా పాకిస్తాన్ ప్రేరణతో కాశ్మీర్ లో జరుగుతున్న అల్లర్లలో 30మందికి పైగా మరణించారు. వందమందికి పైగా గాయపడ్డారు. ఒకవైపు కాశ్మీరులో వేర్పాతువాదులకి మారణాయుధాలు అందిస్తూ అల్లకల్లోలం సృష్టిస్తున్న పాకిస్తాన్, ఫ్రాన్స్ దేశంలో జరిగిన దాడికి సంతాపం తెలపడం చాలా విచిత్రంగా ఉంది.
పాకిస్తాన్ ఉగ్రవాద భూతం జడలు పట్టుకొని ఉయ్యాలలు ఊగుతూ దాని సహాయంతో భారత్ ని దెబ్బ తీస్తున్నందుకు చాలా సంతోషపడుతోంది. కానీ అదే భూతం పాక్ ప్రజలని, అభం శుభం తెలియని విద్యార్ధులని కూడా పొట్టనపెట్టుకొంటోంది. అయినా పాకిస్తాన్ కి బుద్ధి రాకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కనుక దానికి ఏదో ఒకరోజు భారతే బుద్దిచెప్పవలసి రావచ్చు.