ఫ్రాన్స్ లో మరోసారి ఉగ్రవాదం పంజా విసిరింది. ట్రక్కు రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు 84 మందిని బలిగొంది. ట్యునీషియాలో పుట్టి ఫ్రాన్స్ లో ఉద్యోగం చేస్తున్న ట్రక్కు డ్రయివర్ మహమ్మద్ లాహోయిజ్ సృష్టించిన మారణహోమం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. క్షణాల్లో అప్రమత్తమైన పోలీసులు ఆ నరరూప రాక్షసుడిని కాల్చి చంపక పోతే ఇంకా ఎంత మందిని పొట్టనబెట్టుకునే వాడో.
ఫ్రాన్స్ చాలా కాలంగా ఐసిస్ కు టార్గెట్. గత ఏడాది చార్లీ హెబ్దో వారపత్రిక ఆఫీసుపై దాడి, పారిస్ నైట్ క్లబ్ లో మారణహోమం వంటి ఘటనలే దీనికి రుజువు. ఐసిస్ ఇప్పుడు ఎక్కువగా టార్గెట్ చేసిన దేశాలు అమెరికా, టర్కీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇవన్నీ పర్యాటక రంగంలో ముందున్న దేశాలు. టూరిజం ద్వారా భారీగా ఆదాయాన్ని పొందుతున్న దేశాలు.
ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్టులు పర్యటించే దేశం ఫ్రాన్స్. గత ఏడాదే కాదు, దాదాపు దశాబ్దంపైగా ఇదే పరిస్థితి. ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం కీలకం. అంతర్జాతీయ టూరిజంలో రెండో స్థానంలో ఉన్న దేశం అమెరికా. ఆ దేశాన్నీ ఐసిస్ టార్గెట్ చేసింది. ఇటీవల వరస దాడులతో భీతిల్లుతున్న దేశం టర్కీ. పర్యాటక ప్రపంచంలో దీని ర్యాంకు 6. టూరిజమే టర్కీకి కీలకమైన ఆదాయ వనరు. అందులోనూ ఇస్తాంబుల్ ప్రముఖ పర్యాటక కేంద్రం. ఎక్కువ మంది టూరిస్టులను ఆకర్షించేది ఆ నగరమే. ఐసిస్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోయే మరో దేశం ఇంగ్లండ్. పర్యాటక రంగంలో ఇది 8వ స్థానంలో ఉంది. వీటన్నింటినీ ఐసిస్ ముష్కరులు టార్గెట్ చేశారు.
పాశ్చాత్య దేశాలన్నా, క్రైస్తవుల ఆధిపత్యం గల ప్రాంతాలన్నా జీహాదీలకు అగ్గిమంట. అందులోనూ సంపన్న దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీసి ఆనందం పొందడం జీహాదీ ముష్కరులకు అలవాటు. అమెరికా ఖండాల్లో, ఐరోపాలో చాలా దేశాలున్నాయి. అయితే ఐసిస్ తీవ్రవాదులు ఎక్కువగా టార్గెట్ చేసే దేశాల జాబితాను చూస్తే, వాటికి పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయాన్ని దెబ్బతీయడం అనే మరో ఉద్దేశం కూడా ఉందేమో అనిపిస్తుంది. ఇలా తరచూ ఉగ్రదాడులు జరిగితే ఇతర దేశాల టూరిస్టులు అక్కడికి వెళ్లడం తగ్గుతుంది. తద్వారా ఆ దేశాలకు ఆదాయం పడిపోతుంది. ఇది కూడా ఒక వ్యూహం కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.