వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘గడప గడపకి వైకాపా’ కార్యక్రమం ఏదో మొక్కుబడిగా సాగుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. బహుశః అందుకే సాక్షి మీడియాలో దాని పురోగతి గురించి కానీ దాని గణాంకాల గురించి గానీ చిన్న వార్త కూడా వేయడం లేదు. ఒకవేళ విజయవంతం అయ్యుంటే ఈపాటికే సాక్షిలో దాని గురించి చాలా ఊదరగొట్టేస్తూ “రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు పరిపాలనని వ్యతిరేకిస్తున్నారు..తక్షణమే ఆయన పదవిలో నుంచి దిగిపోవాలని కోరుకొంటున్నారు…”అంటూ మంచి మసాలా తగిలించి బోలెడు కధనాలు ప్రచురించేసేది.
గడప గడపకి వైకాపా కార్యక్రమం ప్రారంభించిన రోజు వైకాపా నేతలు కొన్ని గడపలు త్రొక్కినా ఆ తరువాత రోజు నుంచి క్రమంగా డీలాపడిపోయిన్నట్లు తెలుస్తోంది. ఏసీ కార్లలో తిరిగే నేతలు ఎండల్లో కాళ్ళీడ్చుకొంటూ ఇంటింటికీ తిరుగుతూ, ప్రజలకి తమ వంద ప్రశ్నలు చదివి వినిపించి జవాబులు కోరడం అంతే వీజీ అయిన పని కాదని ఎవరైనా ఊహించగలరు. పైగా తెదేపాకి అనుకూలంగా ఉన్న ప్రాంతాలలో ఈ కార్యక్రమం పెట్టుకోవడమే దండుగ. అక్కడ ఇళ్ళకి వెళితే జనాలు మొహాల మీదే తలుపులు వేసేసే ప్రమాదం ఉంటుంది. ఈ కార్యాక్రమాన్ని కార్యకర్తల చేత నడిపించేసి మమ అనిపించేయాలని కొందరు నేతలు ప్రయత్నిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కారణాలు ఏవైనప్పటికీ ఇంతవరకు గట్టిగా ఒక్క జిల్లాలో కూడా గడప గడపకి వైకాపా కార్యక్రమం జరుగుతున్నట్లు లేదు. అందుకే సాక్షి కూడా ఆ ఊసే ఎత్తడం లేదేమో.
జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం మొదలుపెట్టినపుడు తెదేపా నేతలు అనవసరంగా భయపడిపోయి దాని గురించి చాలా అతిగా స్పందించేశారు. కానీ వారం తిరక్కుండానే ఆ కార్యక్రమం మూలపడటంతో తెదేపా నేతలు కూడా ఇప్పుడు నిశ్చింతగా ఉన్నారు. మరోకవారం రోజులు చూసి దానిని ఎందుకు కొనసాగించడం లేదని వారే వైకాపాని ప్రశ్నిస్తారేమో?