ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ శూన్యత ఉన్నదని, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని, బిజెపి అధ్యక్షులు అమిత్ షా రాష్ట్ర నాయకత్వానికి ఒక డైరక్షన్ ఇచ్చారని ఆపార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
రాష్ట్ర రాజకీయ రంగంలో అస్పష్టత, గందరగోళ పరిస్థితులైతే వున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీన పడింది. నీతివంతమైన, సుపరిపాలన కావాలన్నఆకాంక్ష ప్రజల్లో బలపడుతున్నది. అయితే ఇది రాజకీయ శూన్యత కాదు.
దుర్మార్గంగా ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ ను హైదరాబాద్ నుంచి మెడపట్టి గెంటేసిన కాంగ్రస్ ను ప్రజలు చీత్కరించారు..ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కాంగ్రెస్ కి లేదు.
శాసనసభ ఎన్నికల్లో 67 స్థానాల్లో గెలుపొంది ప్రతిపక్ష పార్టీగా ఉన్న వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నైతికంగా బలహీనమైన స్థితిలో ఉంది. తెలుగుదేశం అప్రజాస్వామిక, అవినీతి చర్యలను సమర్థవంతంగా నిలవరించడానికి ప్రజలను సమీకరించడంలో ఫెయిల్ అవుతోంది. 20 మంది ఎమ్మెల్యేలు పార్టీని వదలి , తెలుగుదేశంలో చేరడం ఆ పార్టీ మద్దతుదారులు, కార్యకర్తల్లో ఒక రకమైన నైరాశ్యం, గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పార్టీకి బలమూ, బలహీనతా కూడా జగనే!
కమ్యూనిస్టుపార్టీలు సమస్యలపై ఆందోళనలు చేస్తున్నాపెద్దగా ప్రజల మద్ధతు పొంద లేక పోతున్నాయి. తమకు తాముగా ప్రత్యామ్నాయంగా ఎదగ గలిగిన శక్తి సామర్థ్యాలు వాటికి లేవు.
రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే, కేంద్రంలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని, ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉన్నఅనిశ్చిత రాజకీయ వాతావరణాన్ని అనుకూలంగా మలచుకొని, బలపడాలని బిజెపి వ్యూహాన్ని రూపొందించుకుంది. బిజెపి నాయకత్వం అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పరిస్ధితులు లేవు. బిజెపి మీద ఎపి ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేక భావనలను ఆ పార్టీ బేరీజు వేయలేకపోతోంది.
విభజనకు సహకరించడమే కాకుండా విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడంలోను, ప్రత్యేక తరగతి హోదా కల్పించడంలోను బాధ్యతారాహిత్యంతో, అలసత్వంతో, దగాకోరుగా వ్యవహరిస్తున్న బిజెపి పట్ల ప్రజల్లో ఏహ్యభావం, వ్యతిరేకత పెరుగుతున్నాయి. ఈ పరిస్ధితిలో మార్పు తీసుకురాకుండా రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆశ్చర్యకరం! ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం మాట అటుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యతిరేకభావనలను చల్లబరచకుండా, తెలుగుదేశాన్ని అధిగమించాలన్నది అత్యాశే! అంతే కాకుండా అది తెలుగుదేశం పట్ల సానుభూతిగా మారే అవకాశం కూడా వుంది…
బిజిపి శూన్యమనుకుంటున్న అయోమయ, గందరగోళ వాతావరణం ఎంత విస్తరిస్తే తెలుగుదేశానికి అంత లాభం! ప్రత్యామ్నాయం లేని స్ధితిలో ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా తెలుగుదేశానికే ప్రజలు ఓటు వేసే దిశగా చంద్రబాబు పాలనలో హామీలను గుప్పిస్తున్నారు. ప్రజల ఆగ్రహాన్ని తగ్గించకుండానే బలమైన రాజకీయశక్తిగా మారడానికి బిజెపి చేసే ఏప్రయత్నమైనా తెలుగుదేశానికి ఉపయోగపడుతుంది!