జనతా గ్యారేజ్ వాయిదా పడడం ఎన్టీఆర్ అభిమానుల్ని బాగా నిరాశకు గురిచేసింది. ఆగస్టు 12న వచ్చేస్తున్నాం… వచ్చితీరతాం అని జనతా టీమ్ కుండ బద్దలుకొట్టినట్టు చెప్పడంతో రిలీజ్ డేట్‌పై ఎవ్వరికీ అనుమానాలు రాలేదు. ఈ సినిమా వాయిదా పడుతుందేమో అన్న గాసిప్‌లు అక్కడక్కడా వినిపించినా అభిమానులు నమ్మలేదు. ఎన్టీఆర్ సినిమా వస్తుందన్న కారణంతోనే బాబు బంగారం లాంటి సినిమాలు విడుదల తేదీ వాయిదా వేసుకోవడానికి రెడీ అయిపోయాయి. అలాంటి తరుణంలో జనతా గ్యారేజ్ టీమ్ షాక్ ఇచ్చింది. ”మేం చెప్పిన సమయానికి రాలేకపోతున్నందుకు క్షమించండి” అంటూ క్లారిటీ ఇచ్చేశాయి.
సాంకేతిక కారణాల వల్ల, లేదంటే పోస్ట్ ప్రొడక్షన్‌కి ఎక్కువ సమయం కేటాయించాలని భావించడం వల్ల ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం చెబుతున్నా.. అంతర్గతంగా రీషూట్ జరిగినట్టు గుసగుసలు వినిపించాయి. దాన్ని కొరటాల కూడా కొట్టి పడేయడం లేదు. ‘రీషూట్ జరిగితే తప్పేంటి?’ అని వాదిస్తున్నాడు. దాంతో ఆ అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. 50 శాతం షూటింగ్ పూర్తయిన వెంటనే సమాంతరంగా నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా మొదలైపోతాయి. జనతా గ్యారేజ్ విషయంలోనూ అదే జరిగింది. ఆర్.ఆర్ ఇంకా మొదలవ్వనప్పటికీ.. ఎడిటింగ్, డబ్బింగ్ లాంటి పనులు మొదలయ్యాయి. కేవలం ఆర్.ఆర్ కోసమో ఫైనల్ మిక్సింగ్ కోసమో ఈ సినిమా 20 రోజులు వెనక్కి వెళ్లిందంటే నమ్మబుద్ది కావడం లేదు. షూటింగ్ పూర్తయిపోయిందని ఆ మధ్యే చిత్రబృందం కూడా చెప్పింది. ఇప్పుడు మరో పది రోజుల షూటింగ్ ఉందంటున్నారు. అంటే.. ఎక్కడో తేడా జరిగిందన్నమాట. ఇప్పటి వరకూ రీషూట్ జరిగి ఉండకపోవొచ్చు.. కానీ ఈ పది రోజుల షూటింగ్ రీ షూట్ కోసమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. రీషూట్ జరిగితే ఏంటి? జరక్కపోతే ఏంటి? మంచి సినిమా బయటకు రావడమే ముఖ్యం. కొరటాల అన్నట్టు.. ఎన్టీఆర్‌ని ఓ కొత్త యాంగిల్లో చూపిస్తే, మంచి సినిమా కోసం లేట్ చేస్తే… ఈ 20 రోజుల ఆలస్యం అభిమానులకు పెద్ద సమస్య కాదు. మరి కొరటాల ఏం చేస్తాడో, అభిమానుల్ని ఎలా మెప్పిస్తాడో చూడాలి.