ఈ సమ్మర్లో బ్లాక్‌బ్లస్టర్‌గా నిలిచింది సరైనోడు. కేరళలో యోధానుగా డబ్ అయిన ఈ చిత్రం బన్నీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది. అంతేనా..?? అల్లు అర్జున్‌కి బాగా అచ్చొచ్చిన కేరళలోనూ దుమ్ము దులిపింది. తొలి నాలుగు రోజుల్లోనే కేరళలలో గతంలో బన్నీ నెలకొల్పిన రికార్డులన్నీ ఈ సినిమా తిరగరాసింది. ఇప్పుడు ఏకంగా 24 కేంద్రాల్లో యాభై రోజులు పూర్తి చేసుకొంది. ఓ తెలుగు చిత్రం కేరళలలో ఇన్ని కేంద్రాల్లో డైరెక్ట్‌గా 50 రోజులు ఆడడం ఇదే తొలిసారి. వసూళ్ల పరంగానూ టాప్ 10లో యోధాను నిలిచినట్టు అక్కడి ట్రేడ్ వర్గాలు లెక్కగడుతున్నాయి. సరైనోడుతో కేరళ మార్కెట్లో మరింత పదిలమైన స్థానం సంపాదించుకొన్నట్టైంది.
ఈ సినిమా విడుదలకు ముందు కేరళలో బన్నీ చేసిన భారీ ప్రచారం బాగా కలిసొచ్చింది. దాంతో పాటు.. తెలుగులో విడుదలైన రెండు మూడు వారాలకు కేరళలో రిలీజ్ చేశారు. అప్పటికే టాక్ తెలిసిపోవడంతో ఈసినిమాకి మరింత హైప్ వచ్చింది. దానికితోడు… యోధాను రిలీజ్ అవుతున్నప్పుడు అక్కడ పెద్ద సినిమాలన్నీ డ్రాప్ అయ్యాయి. అది బన్నీ సినిమాకు బాగా కలిసొచ్చాయి. ఇవన్నీ కలసి… బన్నీకి అరుదైన రికార్డ్ కట్టబెట్టాయి. ఎప్పటి నుంచో నేరుగా ఓ మలయాళ చిత్రం చేయాలన్నది బన్నీ కోరిక. యోధాను రికార్డు చూసి బన్నీ ఈసారి టెమ్ట్ అవుతాడేమో చూడాలి.