గత వారం రోజులుగా కాశ్మీర్ లో జరుగుతున్న ఆందోళనలలో 30మందికిపైగా చనిపోయారు, 100 మందికి పైగా గాయపడ్డారు. రెండు పోలీస్ స్టేషన్లపై దాడులు జరిగాయి. ఆ దాడిలో ఒక పోలీస్ అధికారి మరణించారు. 70 ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ తుపాకులని ఆందోళనకారులు అపహరించుకుపోయారు. ఇవన్నీ చాలా ఆందోళన కలిగించే విషయాలే.
ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ కి సరిహద్దు రాష్ట్రంగా ఉన్నందున ఇటువంటి పరిస్థితులు ఏర్పడకుండా ముందే చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది. కానీ రాష్ట్రంలో వేర్పాటువాదులకి మద్దతు ఇచ్చే పి.డి.పి.తో కలిసి భాజపా సంకీర్ణ ప్రభుత్వంలో ఉంది కనుకనే కేంద్రప్రభుత్వం కాశ్మీర్ అల్లర్లని అసలు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.
కాశ్మీర్ లో ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుంటే ప్రధాని నరేంద్ర మోడీ టాంజానియాలో నిశ్చింతగా బాజాలు వాయించుకొంటూ కులాసాగా కాలక్షేపం చేశారని ఆరోపించారు. ఆయన తీరు చూస్తుంటే రోమ్ నగరం తగలబడిపోతుంటే తాపీగా ఫిడేలు వాయించుకొంటూ కూర్చొన్న నీరో చక్రవర్తిని తలపిస్తున్నారని విమర్శించారు. డల్లాస్ నగరంలో కాల్పులు జరిగిన సంగతి తెలియగానే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన విదేశీపర్యటనని అర్ధాంతరంగా ముగించుకొని వచ్చేశారని, కానీ మోడీ మాత్రం హాయిగా దేశావిదేశాలన్నీ చుట్టివచ్చేరని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు.
మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాశ్మీరులో పరిస్థితులు మళ్ళీ క్రమంగా క్షీణించడం మొదలయిందని, అయినా మోడీ ఏనాడూ పెద్దగా పట్టించుకాలేదని విమర్శించారు. భాజపాతో పొత్తులు పెట్టుకొనేందుకు పి.డి.పి. మొదట చాలా విముఖత చూపిందని, అలాగే భాజపా కూడా వేర్పాటువాదులని ప్రోత్సహిస్తున్న పి.డి.పి.తో పొత్తులు పెట్టుకోవడానికి చాలా సంకోచించిందని, కానీ ఆ తరువాత ఆ రెండు పార్టీలు చేతులు కలిపి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు.
ఆ రెండు పార్టీలు చేతులు కలిపినప్పుడే ఇటువంటి భయంకరమైన పరిణామాలు ఏవో ఏర్పడవచ్చనే మా ఊహ నిజమైందని ఆయన అన్నారు. మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్ పేయి, డా. మన్మోహన్ సింగ్ ఇరువురూ కూడా కాశ్మీర్ ప్రజలతో మాట్లాడి ఈ సమస్యకి మూలకారణం తెలుసుకొని దానిని పరిష్కరించేందుకు గట్టిగా ప్రయత్నించడం వలననే కాశ్మీర్ లో ఇంత కాలం శాంతి నెలకొని ఉంది. కానీ మోడీకి కాశ్మీర్ సమస్య పట్ల సరైన అవగాహనే లేకపోవడంతో తనకి తోచినట్లు వ్యవహరిస్తూ పరిస్థితిని ఇంత వరకు తీసుకువచ్చారు అని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. కనీసం ఇప్పటికైనా మేల్కొని పరిస్థితిని చక్కదిద్దితే బాగుంటుందని దిగ్విజయ్ సింగ్ హితవు పలికారు.
కాశ్మీర్ ఇంతగా రగిలిపోతున్నప్పటికీ దిగ్విజయ్ సింగ్ చెప్పిన కారణాల చేతనే మోడీ ప్రభుత్వం ఇంతవరకు ఉదాసీనంగా వ్యవహరించిందని చెప్పకతప్పదు. ఆ ఉదాసీనత కారణంగా కాశ్మీర్ మరింత అల్లకల్లోలంగా మారింది. దానిని పాకిస్తాన్ ఒక అవకాశంగా మలుచుకొని కాశ్మీర్ సమస్య గురించి మళ్ళీ అంతర్జాతీయ వేదికలపై గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టింది. కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, కాశ్మీర్ ప్రజలని భారత ప్రభుత్వం సైనికుల చేత అణగ ద్రొక్కేస్తోందని గట్టిగా ప్రచారం చేస్తోంది. కాశ్మీర్ సమస్య గురించి ప్రపంచ దేశాలు స్పందించకపోయినా, పాకిస్తాన్ చెపుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడటం మొదలుపెత్తాయి. అది భారత్ వైఫల్యంగానే భావించవచ్చు. కనుక మోడీ ప్రభుత్వం అవసరమైతే (కాశ్మీరులో వేర్పాటువాదులకి ప్రోత్సహిస్తున్న) మహబూబా ముఫ్తీ ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకొని రాష్ట్రపతి పాలన విధించయినా సరే కాశ్మీరులో పరిస్థితులని తక్షణమే అదుపులోకి తేవడం చాలా అవసరం.