సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలవబోతున్నాయి. కనుక ఆంధ్రప్రదేశ్ లో తెదేపా, వైకాపాలు పార్లమెంట్ సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే నిన్న సమావేశం నిర్వహించగా, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం లోటస్ పాండ్ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నారు.
గత సమావేశాలలో కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్రరావు ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు వీలుగా విభజన చట్టాన్ని సవరించవలసిందిగా కోరుతూ ఒక ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు. పార్లమెంటు సమావేశాలని రెండు రోజులు ముందుగా వాయిదాపడటంతో దానిపై ఓటింగ్ జరుగాలేదు. ఈసారి ఆ బిల్లుపై పార్లమెంటులో ఓటింగ్ జరుగవచ్చు కనుక అప్పుడు ఏవిధంగా వ్యవహరించాలి? అని తెదేపా సమావేశంలో చర్చించారు.
ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రప్రభుత్వం పదేపదే స్పష్టంగా చెపుతున్నప్పుడు, ఆ బిల్లుకి మద్దతుగా ఓటింగులో పాల్గొనడం మంచిదేనా కాదా? అని తెదేపా ఏమ్పిలతో ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలుస్తోంది. ఆ బిల్లుకి కాంగ్రెస్, వైకాపాలు రెండూ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీకి ఆగ్రహం కలిగించకూడదనే ఉద్దేశ్యంతో తెదేపా ఆ బిల్లుకి మద్దతు ఈయకపోతే, ఆ రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలో తెదేపాకి వ్యతిరేకంగా ప్రచారం చేయవచ్చు. “ప్రత్యేక హోదా సాధించాలనే కోరిక, పట్టుదల తెదేపాకి లేదు..అది రాష్ట్ర ప్రయోజనాల కంటే భాజపాతో స్నేహానికే ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తోంది. మోడీ ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం తాకట్టు పెట్టేసింది,” అని అవి తప్పకుండా ప్రచారం చేస్తాయి. కనుక ఆ బిల్లుకి ఓటింగ్ వచ్చినప్పుడు పరిస్థితులని బట్టి తగిన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇక వైకాపా సమావేశంలో, ఫిరాయింపుల చట్ట సవరణ కోసం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రవేశపెట్టబోయే ప్రైవేట్ బిల్లు గురించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే దానికి ఇతర పార్టీల మద్దతు కూడగట్టడం చాలా కష్టం. ఫిరాయింపుల కారణంగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతోంది. అదీగాక మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కారణంగా కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుని కోరితే అది మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీని వైకాపా ఒప్పించగలిగితే, అది దాని మిత్రపక్షాలని కూడా ఒప్పించగలదు. కనుక ఈ బిల్లుని సభలో చర్చకి చేపట్టాలంటే వైకాపాకి కాంగ్రెస్ పార్టీ సహకారం, మద్దతు అవసరం ఉంటుంది.
ఏపికి ప్రత్యేక హోదా, రైల్వేజోన్ ఏర్పాటు, పోలవరం, నిధులు విడుదల వంటి శేషప్రశ్నలకి సమాధానాల కోసం ఈ పార్లమెంటు సమావేశాలలో చర్చ జరిగి వాటిపై కేంద్రప్రభుత్వం ఏమైనా వ్యతిరేక ప్రకటన చేసినట్లయితే, మళ్ళీ యధాప్రకారం రాష్ట్రంలో తెదేపా, భాజపా నేతల మధ్య కొన్ని రోజులు యుద్ధం సాగవచ్చు. తరువాత మళ్ళీ మామూలే. అయితే కేంద్రప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీల ప్రాధాన్యతలని బట్టే సమావేశాలు ఏవిధంగా సాగుతాయనేది తెలుస్తుంది. కేంద్రప్రభుత్వానికి జి.ఎస్.టి. బిల్లు, కాంగ్రెస్ పార్టీకి కాశ్మీర్ సమస్యలు ప్రాధాన్యతనీయవచ్చు కనుక విజయసాయి రెడ్డి ప్రవేశపెట్టే ప్రైవేట్ బిల్లుపై సభలో చర్చ జరుగుతుందో లేదో ఇప్పుడే ఊహించడం కష్టం.