మల్లన్నసాగర్ నిర్వాసితుల పోరాటంతోనే తలపట్టుకున్న తెలంగాణ ప్రభుత్వానికి మహబూబ్‌నగర్ నోటిఫికేషన్‌పై వివాదంతో మరింత చిక్కుల్లోపడింది. 2013 భూ సేకరణ చట్టం అందరి ఆమోదంతో అత్యున్నత సభ రూపొందించగా ఎందుకు పక్కనపెట్టి 123 జీవో తెచ్చారనేదానికి సమాధానం లేదు. మార్కెట్ రేటుకు నాలుగు రెట్లు పరిహారం ఇవ్వాలని, పునరావాసం సామాజిక ప్రభావం అంచనా తప్పనిసరిగా జరగాలని 2013 చట్టం చెబుతున్నది. పరిహారం ఇచ్చాక ఇంకా పునరావాస బాధ్యత ఏమిటన్న ధోరణిలో 123 రూపొందింది. అసలు పునరావాసం ప్రసక్తే లేకుండా చేసే 214 జీవో కూడా అమలులోకి తెచ్చింది ప్రభుత్వం. మరోవైపున ఏటిగడ్డకిష్టాపూర్ వంటిచోట్ల ఉధృతంగా సాగుతున్న ప్రతిఘటనకు ప్రతిపక్షాల కుట్ర అంటూ దాడి చేసింది. నాలుగు గ్రామాలు కాదన్నా 4000 గ్రామాలను కదిలించి ఎదుర్కొంటామంటూ సదస్సులు పెట్టి హడావుడి చేసింది. ఈ క్రమంలో నీటిపారుదల మంత్రి హరీష్ రావుకూ ముఖ్యమంత్రి కెసిఆర్‌కూ మధ్య కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా వున్నాయనే సంకేతాలు వచ్చాయి. హరీష్ తల్చుకుంటే గంటలో ఇది పరిష్కారం చేయగలరని కావాలనే సంక్షోభం ముదిరేవరకూ చూస్తున్నారని ఆయన అనుయాయులైన సీనియర్లు చెప్పారు. అందుకు కొన్ని ఫార్ములాలు కూడా వినిపించారు. నిజంగానే ఆయన హరితహారం సందర్భంలో హఠాత్తుగా ఏటిగడ్డకిష్టాపూర్‌లో ప్రత్యక్షమై వూరిపెద్దలు కుల పెద్దలతో మాట్లాడి ఒప్పించినట్టు కథనాలు వచ్చాయి. అయితే ఆ వార్త బయిటకు రాకముందే గ్రామస్తులు అందులోనూ మహిళలు తీవ్ర నిరసన తెల్పడంతో కథ మొదటికి వచ్చినట్టయింది. రకరకాల రూపాల్లో అదనంగా లక్ష రూపాయలు పరిహారం ముట్టేట్టు చేస్తానని ఎంపితో సహా వెళ్లిన హరీష్ రావు చేసిన వాగ్దానం ఇతర చోట్ల ఇబ్బంది కదా అని కెసిఆర్ సందేహం వ్యక్తం చేశారట.
ఈలోగా గ్రామంలో నిరసన తీవ్రమైంది. భూములిచ్చేది లేదని తీర్మానాలే చేశారు. వాటిని బేఖాతరు చేస్తూ హరీష్ ఆధ్వర్యంలో కొంతమంది భూములిస్తున్నట్టు సిద్దిపేటలో రిజిస్ట్రేషన్లు జరిపించారు.ఇది పూర్తిపత్రాలు గాక సాదాబైనామాలు వున్నవారిని ఒత్తిడి చేయడం వల్ల జరుగుతున్నదని కోదండరాం వంటి వారే ఆరోపించారు. ఈ దశలోనే మహబూబ్‌నగర్ జిల్లాలో పాలుమూరూ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం భూ సేకరణకుకలెక్టర్ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రైతులు హైకోర్టులో సవాలు చేశారు.దానిలో భాగమైన వట్టెం రిజర్వాయర్ కింద 1009 ఎకరాలు సేకరించడానికి జులై1న విడుదలైన ఈ నోటిఫికేషన్ 2013 స్పూర్తిని ఎలా ఉల్లంఘిస్తున్నదీ పిటిషనర్లు సోదాహరణంగా పొందుపర్చారు. విచారణ జరిపిన న్యాయమూర్తి రాజశేఖర్ రెడ్డి ఇదంతా ఆషామాషీ వ్యవహారంగా వుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలోనూ ఇలాగే హైకోర్టు విమర్శిస్తే రైతులను ఒప్పించిన తర్వాతనే భూ సేకరణ చేస్తామని ప్రభుత్వం చెప్పింది.అయినా వారిపై సామదాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నది.ఇక ఇప్పుడు ఏకంగా హైకోర్టు మరోసారి అక్షింతలు వేసింది.ఈ తరుణంలో అటు 2013, ఇటు 123 కాకుండా హరీష్ ఫార్ములా కాకుండా మరేదైనా మధ్యేమార్గం చూడాలని ఆలోచనలో పడింది ప్రభుత్వం. లోపాలను సవరించి పరిహారం పెంచి మరో జీవో విడుదల చేస్తే పూర్తిగా వెనక్కు తగ్గినట్టు గాకుండా బయిటపడవచ్చని భావిస్తున్నది. నిమ్జ్ ఫార్మాసిటీ ఇంకా చాలా వున్నాయి గనక ఇప్పుడే ఈ సమస్యకు ముగింపు పలకాలన్న భావన కూడా వుంది. వాస్తవంగా రైతులతోరాజకీయ పార్టీలతో మాట్లాడి ఒప్పిస్తే మరీ మంచిది.