స్వర్గీయ ఎన్టీఆర్ చేతిలో నుంచి చంద్రబాబు నాయుడు చేతిలోకి తెదేపా వచ్చిన తరువాత దానిపై ఆయనకి హక్కుందా లేక నందమూరి వారికుందా? అని కొంత కాలం చర్చలు జరిగాయి. క్రమంగా అయన తెదేపాపై పూర్తిగా పట్టు సాధించడంతో ఇప్పుడు తెదేపాపై నందమూరి హక్కుల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ఇప్పుడు తెదేపాకి వారసుడు ఎవరు అంటే నారా లోకేష్ అని అందరూ టక్కున జవాబు చెపుతారు. నారా లోకేష్ వారసత్వానికి సవాలుగా కనిపిస్తున్న జూ.ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణలందరినీ చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా అతిధి పాత్రలకే పరిమితం చేశారు. ముఖ్యంగా జూ.ఎన్టీఆర్ మళ్ళీ తెదేపావైపు చూడకుండా చేసి లోకేష్ భవిష్యత్ కి మార్గం సుగమం చేశారు. మనదేశంలో వారసత్వ రాజకీయాలు సర్వసాధారణమైన విషయమే కనుక కొడుకు కోసం చంద్రబాబు తపనని తప్పుపట్టలేము.
చంద్రబాబు నాయుడు వారసుడు లోకేష్ అని నిర్ధారణ అయినప్పటికీ తెదేపా భవిష్యత్ ఆయనపైనే ఆధారపడుందా? లేక ఆయన భవిష్యతే తెదేపాపై ఆధారపడి ఉందా? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం కష్టమే. ప్రస్తుతం ఆయన తెదేపాలో, ప్రభుత్వంలో నెంబర్: 2 స్థానంలో కొనసాగుతున్నప్పటికీ, ఆ స్థానానికి తానే అన్ని విధాల అర్హుడనని ఆయన ఇంతవరకు నిరూపించుకోలేకపోయారని తెదేపాలోనే గుసగుసలు వినిపిస్తుంటాయి. గుసగుసల మాటేలాగ ఉన్నా ఇంత పుషింగ్ ఇస్తున్నా కొడుకు తన సత్తా చాటుకోలేకపోవడం బహుశః చంద్రబాబు నాయుడుకి కూడా ఆందోళన కలిగిస్తూనే ఉండవచ్చు.
తెదేపాకి,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాజకీయ వారసుడుగా ఎదగవలసిన నారా లోకేష్ ఈ పదేళ్ళ కాలంలో తనంతట తాను సాధించింది ఏమీ లేదు. నేటికీ తన తండ్రి ఏర్పాటు చేసిన పదవులలో కొనసాగుతున్నారు అంతే. అంటే నేటికీ ఆయన తన తండ్రి మీద, పార్టీ మీద ఆధారపడి ఉన్నారని అర్ధమవుతోంది.
తెదేపాకి ప్రజలిచ్చిన సమయంలో అప్పుడే రెండున్నరేళ్ళు పూర్తి కావస్తోంది. మిగిలిన రెండున్నరేళ్ళలో నారా లోకేష్ తనని తాను నిరూపించుకోలేకపోతే అప్పుడు ఆయన పరిస్థితి ఏమిటి? పార్టీ పరిస్థితి ఏమిటి? అని ఆలోచిస్తే సమాధానం దొరకదు.
ఈ నేపధ్యంలో చంద్రబాబు నాయుడు తరువాత తెదేపా పగ్గాలు ఎవరు చేపడతారు? అంటే దానికీ సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే, తెదేపా నేతలు ఎవరూ ఇంతవరకు అటువంటి ఆలోచన చేయలేదు..చేసినా ఎవరూ బయటపడలేదు. ఒకవేళ వచ్చే ఎన్నికలలో తెదేపా గెలిచి మళ్ళీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అయితే నారా లోకేష్, తెదేపా మరో ఐదేళ్ళ వరకు చూసుకోనవసరం లేదు. ఒకవేళ ఓడిపోయి ప్రతిపక్షంలోకి మారితే, అప్పుడు నారా లోకేష్ తెదేపా పగ్గాలు చేపట్టడానికి ఇష్టపడకపోవచ్చు కనుక చంద్రబాబు నాయుడే పార్టీని నడిపించవలసి ఉంటుంది. అంటే తెదేపా లోకేష్ పై కాకుండా చంద్రబాబు నాయుడు మీదే ఆధారపడి ఉంటుందని స్పష్టం అవుతోంది.
ఒక వ్యక్తిపై ఆధారపడి పార్టీ కొనసాగుతున్నపుడు, సకాలంలో దాని వారసులు పార్టీ పగ్గాలు చేపట్టలేకపోయినా, చేపట్టినవారు అసమర్దులైనా అతిపెద్ద వ్యవస్థ వంటి పార్టీ పూర్తిగా దెబ్బ తింటుంది. తమిళనాడులో డిఎంకె పార్టీ అధినేత కరుణానిధి నిలబడలేని పరిస్థితిలో ఉన్నాకూడా మొన్న జరిగిన ఎన్నికలలో ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నిలబడవలసి దుస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆయన రాజకీయ వారసులు అళగిరి, స్టాలిన్ నేటికీ పార్టీ పగ్గాలు చేపట్టలేని పరిస్థితిలో ఉన్నారు. వారికి ఆ శక్తి లేదని గ్రహించినపుడు కరుణానిధి పార్టీలో అందుకు సమర్ధుడైన వ్యక్తిని గుర్తింఛి ఉండి ఉంటే ఆయనకి, పార్టీకి ఈ దుస్థితి కలిగి ఉండేదే కాదు. కానీ పార్టీకి కొడుకులు తప్ప బయటవారెవరూ వారసులుగా పనికిరారు..అందుకు అర్హులు కారనే ఒక నిశ్చితాభిప్రాయం మన రాజకీయ నేతలందరిలో ఉంది కనుకనే వారు తప్ప మరెవరినీ ఆ స్థానంలో ఊహించుకోలేకపోతున్నారు. అందుకే మొన్న జరిగిన ఎన్నికలలో విజయం సాధించి అధికారంలో ఉండవలసిన డిఎంకె పార్టీ నేడు ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. దానిని వీల్ చైర్ లో కూర్చొని కరుణానిధి నడిపించవలసివస్తోంది. తెదేపాతో సహా దేశంలో అన్ని రాజకీయ పార్టీలు దీనిని ఒక గుణపాఠంగా స్వీకరించడం మంచిది.