‘ప్రభుత్వం ఏమి చెప్పినా, చేసినా దానిని వ్యతిరేకించడమే ప్రతిపక్ష పార్టీల విధి. అదే వాటి బాధ్యత’ అనే ఒక మూర్కపు సిద్దాంతాన్ని గుడ్డిగా అమలు చేయడానికే మన రాజకీయ పార్టీలు బాగా అలవాటుపడ్డాయి. అదే విషయం మరోమారు నిరూపిస్తున్నట్లుగా వైకాపా ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రష్యా పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత మురికివాడ కట్టాలంటే నేను ఎక్కడికో వెళ్ళకరలేదు. అంటే మన భారతీయ కంపెనీలు అటువంటి నాసిరకమైన నిర్మాణాలు మాత్రమే చేయగలవు..అందుకే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రాజధాని నిర్మించడం కోసం విదేశీ కంపెనీల సహాయం కోరుతున్నాను, అని ఆయన ఉద్దేశ్యమని అర్ధమవుతోంది. స్వదేశీ కంపెనీలు, ఇంజనీర్లు వారి శక్తిసామర్ధ్యాల పట్ల ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ అంత చులకనగా మాట్లాడటం తప్పే. ఆయన ఒక ఉద్దేశ్యంతో ఆ మాట అంటే వైకాపా ఎమ్మెల్యే కే.శ్రీనివాసులు బోడి గుండుని మోకాలుతో ముడిపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లుగా మురికివాడలలో నివసించే ప్రజలని అవమానపరిచే విధంగా మాట్లాడారు. వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. మురికి వాడలలో నుంచే డా. అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు పుట్టారు అంటూ చాలా ఆవేదన పడ్డారు. మురికివాడలలో నివసించే ప్రజలను అవమానిస్తూ మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు.
మళ్ళీ అదే ‘మురికి’ పదాన్ని పట్టుకొని “చంద్రబాబు నాయుడు బుర్ర నిండా మురికే, ఆయన మనసు నిండా మురికే..ఆయన ఆలోచనలన్నీ మురికే” అంటూ విమర్శించారు. అమరావతి మురికివాడలాగ కాకుండా అందరూ మెచ్చుకొనే విధంగా గొప్పగా ఉండాలని మాత్రమే చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు తప్ప మురికివాడలో నివసించే ప్రజలని ఈసడిస్తూ ఆయన ఏమీ అనలేదని అర్ధమవుతూనే ఉంది. కానీ చంద్రబాబు నాయుడుని విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి వద్ద మంచి మార్కులు పడతాయనే ఉద్దేశ్యంతోనే ఆయన మాటలలో మురికివాడనే ఒక ముక్కని పట్టుకొని మనోభావాలతో మంచి కధ అల్లేసినట్లున్నారు.