ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం డిల్లీలో అంతర్రాష్ట్ర మండలి సమావేశం జరిగింది. దానిలో ఆంధ్రా, తెలంగాణా ముఖ్యమంత్రులతో బాటు దేశంలో అన్ని రాష్ట్రల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దానిలో కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ, ఆయన శాఖకి చెందిన ఉన్నతాధికారులు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా, ప్రధాని కార్యాలయ అధికారులు, రాష్ట్ర ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలుపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఆ చట్ట ప్రకారం రాష్ట్రానికి ఇచ్చిన హామీలని అన్నిటినీ అమలుచేయమని ప్రధాని నరేంద్ర మోడీ నీటి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాని ఆదేశించారు. అందుకోసం రాష్ట్ర అధికారులతో నిరంతరం చర్చిస్తూ తగిన రోడ్డు మ్యాప్ తయారుచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అది ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానికి వివరించి కేంద్ర సహాయం కోసం అర్ధించారు. సుమారు గంటన్నర సేపు సాగిన ఈ సమావేశంలో విభజన చట్టంలో ఇంకా అమలుచేయవలసిన హామీలన్నిటిపై చాలా లోతుగా చర్చ జరిగినట్లు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ మీడియాకి తెలియజేశారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రతీ హామీని ఖచ్చితంగా అమలుచేయాలని ప్రధాని నరేంద్ర మోడీ తమని ఆదేశించారని జైట్లీ తెలిపారు.
గత ఏడాది కూడా ప్రధానితో ఇటువంటి సమావేశమే జరిగింది. అప్పుడు కూడా రోడ్డు మ్యాప్ తయారు చేయమని ప్రధాని నీతి ఆయోగ్ ని ఆదేశించారు. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ కి సహాయపడేందుకు నీతి ఆయోగ్ రోడ్డు మ్యాప్ గీస్తునే ఉంది. అది ఇంకా ఎన్నేళ్ళకి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. అప్పుడు కూడా కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఇవే మాటలు చెప్పారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆయన పక్కనే నిలబడి ఉన్నారు. అప్పుడు, ఇప్పుడూ జైట్లీ అవే హామీలని ఎక్కడా అక్షరం పొల్లు పోకుండా పునరుద్ఘాటించారు. జైట్లీ మీడియా సమావేశంలో ఎక్కడా ప్రత్యేక హోదా ఊసు లేదు. క్రిందటి ఏడాది ఇటువంటి సమావేశంలోనే ప్రత్యేక హోదా కంటే మంచి ఆర్ధిక ప్యాకేజిని ఇస్తామని జైట్లీ స్వయంగా చెప్పారు. ఆ ఊసు కూడా లేదు. రైల్వేజోన్ ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ప్రధాని గంటన్నర సేపు సమావేశం అవడమే చాలా గొప్ప విషయం అని భావించి సంతోషపడాలేమో? రెండేళ్ళు పూర్తయినా ఇంకా ఎందుకు నిధులు విడుదల చేయడం లేదో, రాష్ట్రంలో నిర్మాణ కార్యక్రమాలు ఎందుకు ఊపందుకోలేదో జైట్లీ చెప్పరు. బాబు చెప్పరు. బహుశః మళ్ళీ వచ్చే ఏడాది కూడా ఇదే రికార్డు వేస్తారేమో? ఎందుకీ అనవసరమైన శ్రమ?