ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒకేసారి రెండు సర్వేలు జరుగుతున్నాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రజా సాధికార సర్వే కాగా రెండవది గడప గడపకి వైకాపా పేరిట ఆ పార్టీ చేపట్టిన సర్వే. రెండూ కూడా వేర్వేరు కారణాలా చేత నత్త నడకన సాగుతున్నాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో రాష్ట్రంలో ప్రజల ఆర్ధిక, సామాజిక వివరాలను సేకరిస్తోంది. వైకాపా చేపట్టిన సర్వే ద్వారా చంద్రబాబు నాయుడు పాలన పట్ల ప్రజలు తృప్తిగా ఉన్నారా లేదా? చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలని అన్నిటినీ అమలుచేశారా లేదా? అనే వివరాలు సేకరించడం. పనిలో పనిగా ప్రజలని ముఖ్యమంత్రి ఏవిధంగా మోసం చేస్తున్నారో వివరించడం కూడా దాని లక్ష్యం. దాని కోసం వంద ప్రశ్నలతో కూడిన ఒక ప్రశ్నా పత్రం కూడా తయారుచేశారు.
ప్రభుత్వం మొదలుపెట్టిన సర్వేలో సాంకేతిక ఇబ్బందుల కారణంగానే జాప్యం జరుగుతోంది. అది అధికారిక కార్యక్రమం కనుక కొంచెం ఆలస్యమైనా తప్పకుండా పూర్తవుతుంది. ఇంత హటాత్తుగా ప్రభుత్వం సర్వే ఎందుకు నిర్వహిస్తోంది? ఆ అవసరం ఏమిటి? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ సర్వే ద్వారా ప్రజలని ఫిల్టరింగ్ చేసి సంక్షేమ పధకాల ఆర్ధిక భారం తగ్గించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆరోపిస్తున్నాయి. ఏ ప్రభుత్వమైనా సంక్షేమ పధకాలను వినియోగించుకొంటున్న అనర్హులని ఏరివేయడం కోసమే ఇటువంటి సర్వేలు నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ఉద్దేశ్యంతో ఈ సర్వే నిర్వహిస్తోందని భావించవచ్చు. కనుక ప్రతిపక్షాల అనుమానాలు కూడా సహేతుకమేనని భావించవచ్చు.
అయితే రాష్ట్ర ఐటి, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి దీని గురించి చాలా విచిత్రంగా మాట్లాడారు. ఈ సర్వే నిర్వహిస్తే ప్రజలకి ఎక్కడ సంక్షేమ పధకాలు అందిపోతాయనే భయంతోనే ప్రతిపక్షాలు దానిపై అభ్యంతరాలు, విమర్శలు చేస్తున్నాయని అన్నారు.
ప్రభుత్వం సంక్షేమ పధకాలు అమలు చేస్తానంటే ఎవరు కాదనరు. భయపడాల్సిన పని లేదు. కానీ వాటిని తొలగిస్తుందనే ప్రజలు భయపడుతున్నారు. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ మంత్రిగారు దానికి తెదేపా స్టైల్లో బాష్యం చెప్పారు. తమ ప్రభుత్వం చేస్తున్న సర్వేని ఎవరూ వేలెత్తి చూపకూడదనుకొంటారు. కానీ వైకాపా మొదలుపెట్టిన గడప గడపకి వైకాపా కార్యక్రమంపై తెదేపా నేతలందరూ మూకుమ్మడిగా విమర్శలు చేస్తుంటారు.