నందమూరి బాలకృష్ణ చేసిన మరో విభిన్న ప్రయత్నం.. ప్రయోగం – ఆదిత్య 369. ఆ సినిమా ఇప్పుడు చూసినా… కొత్తగా అనిపిస్తుంది. సింగీతం అద్భుత ఊహ.. బాలయ్య అభినయం, ఇళయరాజా సంగీతం ఇవన్నీ కలిసి ఈ సినిమాకి ఓ క్లాసిక్ చేశాయి. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని ఒకే సినిమాలో చూపించిన ఘనత వహించిందీ చిత్రం. ఆదిత్య 369కి నేటితో సరిగ్గా పాతికేళ్లు పూర్తయ్యాయి. దాంతో.. ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడంటూ.. పాత ప్రశ్నే మళ్లీ కొత్తగా ఉదయిస్తోంది. ఆదిత్య 369కి సీక్వెల్ గా ఆదిత్య 999 చేయాలన్నది బాలయ్య ఆలోచన. సింగీతం శ్రీనివాసరావు కూడా అందుకు సిద్ధంగానే ఉన్నారు. నిజానికి బాలయ్య వందో సినిమాగా ఆదిత్య 999 తెరకెక్కాల్సివుంది. కానీ.. వాయిదా పడింది. ఆదిత్య 999 స్క్రిప్టు పూర్తి స్థాయిలో సిద్ధమైపోయింది కూడా. బాలయ్య ఓకే అంటే ఎప్పుడైనా ఈ సినిమా పట్టాలెక్కేయొచ్చు. 101వ చిత్రాన్ని కృష్ణవంశీకి అప్పగించిన బాలయ్య 102వ సినిమాగా ఆదిత్య 999ని మొదలెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతని సింగీతంకి అప్పగించాలా? లేదా? అనే డైలామాలో ఉన్నాడట బాలయ్య.
సింగీతం తయారు చేసిన స్క్రిప్టు నచ్చినప్పటికీ… ఇప్పటి టెక్నాలజీని సీనియర్ దర్శకుడు సింగీతం ఎంత వరకూ అందిపుచ్చుకొంటారనే విషయంలో బాలయ్యకు కొన్ని అనుమానాలున్నాయి. సింగీతం అయితే… `ఈ సినిమా నేనే చేస్తా` అంటున్నార్ట. పెద్దాయనకు గౌరవం ఇవ్వాలా? లేదంటే ఆయన్ని ఒప్పించి మరో దర్శకుడి చేతిలో ఈ కథ పెట్టాలా అనే విషయాన్ని బాలయ్య చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు వినికిడి. ఒకవేళ ఆదిత్య 999 చేయడం తనకు కుదరకపోయినా.. తన వారసుడికైనా ఇవ్వాలన్నది బాలయ్య ఆలోచన. ఆదిత్య కి సీక్వెల్ రావడం ఖాయం. అందులో బాలయ్య నటిస్తాడా, మోక్షజ్ఞ కు అప్పగిస్తారా? దర్శకుడెవరన్నది తేలాలి.