కబాలి క్రేజ్ దేశమంతా పాకింది. ఈసినిమా ఎప్పుడొస్తుందా? అని సినీ అభిమానులు, మరీ ముఖ్యంగా రజనీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కబాలి థియేటర్లలో సందడి చేయడానికి ఇంకో 5 రోజుల సమయమే ఉంది. ఈలోగా చెన్నైలోని థియేటర్లు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. కటౌట్ల హంగామా మొదలైపోయింది. అయితే తెలుగు రాష్ట్రాలలో ఇందుకు పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. కబాలి సినిమాని టాలీవుడ్లో ప్రమోషన్లు కరువయ్యాయి. ఆడియో ఫంక్షన్ ఒకటి చేసేసి చేతులు దులుపుకొన్నారు. అదీ… పెద్దగా సినీ సెలబ్రెటీస్ ఎవ్వరూ లేకుండానే.
ఇప్పుడు కబాలి విడుదలకూ తెలుగులో కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయని టాక్. గతం లో రజనీ కాంత్ సినిమాల్ని కొని భయంకరంగా నష్టపోయిన కొంతమంది బయ్యర్లు ఈసినిమా విడుదలకు మోకాలడ్డుతున్నారని టాక్. మరీ ముఖ్యంగా కథానాయకుడు, లింగ సినిమాలు తెలుగులో తీవ్ర నష్టాల్ని చవి చూశాయి. వాటి సంగతి తేల్చి.. కబాలిని విడుదల చేసుకోమని పట్టుపడుతున్నారట. గతంలో రజనీ సినిమాల్ని కొన్నవాళ్లెవరూ కబాలి జోలికి రాలేదు. కాబట్టి.. ఇప్పుడు కబాలిని విడుదల చేయాలంటే పాత బాకీల్ని సెట్ చేయాల్సిందే. కబాలి రైట్స్ ని షణ్ముఖ పిక్చర్స్ కొనుగోలు చేసింది. అయితే వారి వెనుక అల్లు అరవింద్ ఉన్నాడన్నది ఓపెన్ సీక్రెటే. అల్లు అరవింద్ అంటే గిట్టనివాళ్లు, కబాలి రైట్స్ కొందామని ప్రయత్నించి భంగపడినవాళ్లూ.. ఇప్పుడు కబాలికి ఏదోలా సమస్యలు సృష్టించాలని భావిస్తున్నార్ట. అయితే తెర వెనుక అల్లు అరవింద్ ఈ వ్యవహారాన్ని క్లియర్ చేసుకొనే పనిలో పడ్డాడని తెలుస్తోంది. అరవింద్ స్కెచ్ ముందు ఇవన్నీ వర్కవుట్ కావని, కబాలిని అడ్డుకోవడం అసాధ్యమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.