కడుపు చించుకొంటే కాళ్లపై పడుతుందన్నది ఓ నానుడి. పరిశ్రమలో లుకలుకలు చాలా ఉంటాయి. పరిశ్రమని నమ్ముకొన్న వాళ్లు గమ్మునుండాల. కాలం ముందు చేతులు కట్టుకొని నిలబడాల. నాలుగు అడుగులు వెనక్కి వేయడం తప్పు కాదు..అదే పదడుగులు ముందుకు తీసుకెళ్తుంది. ఈ విషయం రచయిత చిన్ని కృష్ణకు అర్థం కావడం లేదు. అందుకే.. తనలోపలున్న బాధనంతా కక్కేశాడు. ”నేను రచయితని.. ఎవ్వరి దగ్గరకూ వెళ్లి కథలు వినిపించను. కావాలంటే వాళ్లే నా దగ్గరకు రావాలి” అంటూ మొండి పట్టుపట్టుకొని కూర్చున్నాడు. అందుకేనేమో.. దాదాపు పదిహేనేళ్ల ప్రయాణంలో ఆరేడు సినిమాలకంటే మించి చేయలేదు.
అదేమిటయ్యా అని అడిగితే ”నాకు భజన చేయడం చేతకాదు. నా దగ్గర చిడతలు కూడా లేవు” అంటున్నాడు. అంటే.. ఓ హీరోకి కథ చెప్పి ఒప్పించుకోవడం భజనా? ఇప్పటి రచయితలంతా అదే చేస్తున్నారా? లేదంటే అవకాశాలు రావా? ఏమిటో చిన్ని కృష్ణయ్య మితండ వాదం??
టాలీవుడ్లో రచయితలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఓ సూపర్ హిట్ కథ ఇస్తే… మరుసటి సినిమాకి కోటి రూపాయలు డిమాండ్ చేసుస్తున్నారు. కథల కొరత ఆ స్థాయిలో ఉంది. అలాంటప్పుడు ‘నేనింతే.. ఇలానే ఉంటా’ అంటే ఎవరికి నష్టం? అయితే అమీర్‌ఖాన్ కోసం స్క్రిప్టు తయారు చేస్తున్నానని, త్వరలో అమీర్‌కి కథ అందచేస్తానని అంటున్నాడు చిన్నికృష్ణ. ఇది మరీ విడ్డూరం. అమీర్ ఖాన్ ఏమీ చిన్ని కృష్ణ అడ్రస్ వెదుక్కొంటూ రాలేదు కదా..? చిన్ని కృష్ణే అమీర్‌ని వెదుక్కొంటూ వెళ్తున్నాడు కదా? మరి ఇక్కడ లేని నామోషీ.. మన హీరోలకు కథలు చెప్పడంలో ఎందుకొచ్చిందో మరి..