ఏపిలో తెదేపా-భాజపాలు ఇంకా కలిసే ఉన్నప్పటికీ నిత్యం కీచులాడుకుంటూనే ఉంటాయి. తెలంగాణాలో విడిపోయాయి కానీ కీచులాడుకోవడం మానేశాయి. వాటిది విచిత్ర బందం అనుకొంటే, తెలంగాణాలో తెరాస-భాజపాల మద్య కూడా అటువంటి విచిత్ర బంధమే కనిపిస్తోంది. ఆ రెంటికీ మద్య పొత్తులు లేవు కనుక ఒకదానిని మరొకటి విమర్శించుకొంటుంటాయి. కేంద్రప్రభుత్వం తెలంగాణాకి అన్యాయం చేస్తోందని తెరాస నేతలు విమర్శిస్తుంటారు. తెలంగాణాలో నిరంకుశ కుటుంబ పాలన సాగుతోందని రాష్ట్ర భాజపా నేతలు విమర్శిస్తుంటారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ కెసిఆర్ కి దేశంలో నెంబర్:1 ముఖ్యమంత్రి ర్యాంక్ ఇస్తారు. భాజపా అధ్యక్షుడు తెరాసకి కేంద్రమంత్రి పదవి ఆఫర్ చేస్తారు. కేంద్రప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వ పధకాలని ప్రశంసిస్తుంటుంది. బహుశః అందుకే రేవంత్ రెడ్డి ఆ రెండు పార్టీల మద్య రహస్య అవగాహనా ఉందని వాదిస్తున్నారేమో?
నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. ఈసారి జి.ఎస్.టి.బిల్లుని ఎలాగయినా పార్లమెంటు చేత ఆమోదముద్ర వేయించుకోవాలని మోడీ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. దానికి అన్ని పార్టీల సహకారం కోరుతోంది. తెరాస ఎంపిలతో నిన్న ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహించిన సమావేశంలోజి.ఎస్.టి.బిల్లుకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. మోడీ ప్రభుత్వానికి పార్లమెంటులో అంశాల వారిగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే హైకోర్టు విభజన, తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన వివిద అభివృద్ధి పధకాలకి నిధుల కోసం కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని నిర్ణయించారు. జి.ఎస్.టి.బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ ఈసారయినా సహకరిస్తుందో లేదో ఇంకా తెలియదు కనుక దానిని ఆమోదింపజేసుకోవడానికి, మోడీ ప్రభుత్వానికి ప్రతీ ఒక్క ఎంపి మద్దతు చాలా అవసరమే. కనుక తెరాస మద్దతుని అది స్వాగతిస్తుంది. అందుకు ప్రతిగా తెరాస డిమాండ్లను అంగీకరిస్తుందో లేదో చూడాలి.