అఫ్జల్ గురు, యాకూబ్ మీమన్, బుర్హాన్ వనీ వంటి ఉగ్రవాదులకి పాకిస్తాన్ ప్రభుత్వం, కాశ్మీరులో వేర్పావాదులు మద్దతు ఇస్తే ఆశ్చర్యం లేదు కానీ మన రాజకీయ నేతలు, న్యాయవాదులు, విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యలభ్యసిస్తున్న కొందరు విద్యార్దులు కూడా వారికి బహిరంగంగానే మద్దతు ప్రకటించడం చాలా దురదృష్టకరం.
ఉగ్రవాది బుర్హాన్ వనీని భద్రతాదళాలు ఎన్కౌంటర్ చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొందరు విద్యార్ధులు శనివారం రాత్రి యూనివర్సిటీ ఆవరణలో ర్యాలీ నిర్వహించి అనంతరం సమావేశం కూడానిర్వహించారు. యూనివర్సిటీలో మరో వర్గానికి చెందిన విద్యార్ధులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. వారు కూడా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇరువర్గాల మద్య ఘర్షణ మొదలవగానే పోలీసులు వారిని చెదరగొట్టారు.
అదే సమయంలో మరికొందరు విద్యార్ధులు డా.బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం తయారుచేయించి యూనివర్సిటీలోకి ప్రవేశించబోతే వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ వారి మధ్య మరో ఘర్షణ జరిగింది. యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ వేముల మరణించి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా మరికొందరు విద్యార్ధులు యూనివర్సిటీలో ఆవరణలో శనివారం రాత్రే కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
యూనివర్సిటీ వైస్-చాన్సిలర్ అప్పారావు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితులని సమీక్షించారు. ఇదివరకు కూడా ఇదే యూనివర్సిటీలో చిన్నగా మొదలయిన ఆందోళనలు చివరికి జాతీయస్థాయి సమస్యగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఒకే సమయంలో యూనివర్సిటీలో ఇన్ని సంఘటనలు జరగడం కాకతాళీయమా లేకపోతే వెనుక ఏదైన పెద్ద కుట్ర ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యూనివర్సిటీలలో తరచూ నెలకొంటున్న ఇటువంటి పరిస్థితులని చూస్తుంటే,యూనివర్సిటీలకి వైస్-ఛాన్సిలర్లని కాక ఐ.పి.ఎస్. అధికారులని ఇన్-ఛార్జ్ లుగా నియమించవలసిన అవసరం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇకపై నిఘా సంస్థలు యూనివర్సిటీలపై కూడా నిఘా పెట్టవలసి వస్తుందేమో?