ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అచ్చెం నాయుడు ఈనెల 19 నుంచి 22 వరకు మలేషియా యాత్రకి బయలుదేరుతున్నారు. ఆయన కార్మికమంత్రి కనుక ఆ దేశంలో కార్మిక చట్టాలు, వాటి అమలు తీరుపై అధ్యయనం చేయడానికి వెళుతున్నారని సరిపెట్టుకోవచ్చు. కానీ ఆయనతో బాటు ఆయన భార్యని కూడా వెంట తీసుకువెళుతున్నారు. ఆమెకీ ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. దాని కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పదిమందిని వెంటబెట్టుకొని ప్రత్యేక విమానాలలో తరచూ విదేశీయానాలు చేస్తూ ప్రజాధనం దుబారా చేయడమే కాకుండా మంత్రులు, వారి కుటుంబాలని ప్రభుత్వ ఖర్చులతో విదేశాలలో షికార్లు చేసి రావడానికి పంపించడం చాలా శోచనీయమని వైకాపా నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు విమర్శించారు. ప్రజాధనానికి ధర్మకర్తగా వ్యవహరించవలసిన ముఖ్యమంత్రే దానిని ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెట్టేస్తున్నారని విమర్శించారు.
గత రెండేళ్ళుగా రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమతమవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఆయన మంత్రులు, ప్రజాప్రతినిధులు, తెదేపా నేతలు అందరూ కోరస్ పాడుతూనే ఉన్నారు. అయినా తమ ఖర్చులని, విలాసాలని ఏమాత్రం తగ్గించుకోవడానికి ఇష్టపడటం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి నివాసాలు, క్యాంప్ కార్యాలయాల ఆధునీకరణ పనులకి కోట్లాది రూపాయలు మంచి నీళ్ళలా ఖర్చుపెట్టేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మాష్టర్ ప్లాన్ చేతిలో సిద్దంగా ఉన్నప్పటికీ శాశ్విత భవనాలు నిర్మించే ఆలోచన చేయకుండా తాత్కాలిక సచివాలయంపై వందల కోట్లు ఖర్చు చేయడాన్ని కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఒకవైపు ఆర్ధిక సమస్యలని చెపుతూనే ఈవిధంగా ఖర్చులు చేస్తున్నందునే కేంద్రప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని రాష్ట్ర భాజపా నేతలు విమర్శిస్తున్నారు. కానీ ఎవరెన్ని విమర్శలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిని పట్టించుకోకుండా చాలా ఆడంబరంగానే వ్యవహరిస్తోంది. అందుకు మంత్రిగారి భార్యని విదేశాలకి పంపడమే మరో తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.