ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? అన్నట్లు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు వేరేలా మాట్లాడుతారనుకోలేము. పైగా చంద్రబాబు నాయుడుని ఎంతగా విమర్శిస్తే జగన్ వద్ద అన్ని మార్కులు పడతాయి కనుక వైకాపా నేతలు పోటీలుపడి చంద్రబాబు నాయుడుని విమర్శిస్తుంటారు. అటువంటివారిలో నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఒకరు. ఆమె వారానికి పదిరోజులకి ఓమారు మీడియా ముందుకు వస్తుంటారు. అది చంద్రబాబు నాయుడు విమర్శించడానికి మాత్రమే. మళ్ళీ నిన్న కూడా ఆమె అదే పని చేశారు.
ఆమె తన నియోజక వర్గం నగరిలో పార్టీ కార్యకర్తలని, నేతలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “స్థానిక తెదేపా ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణం నాయుడు నేరుగా మనల్ని ఎదుర్కొనే ధైర్యం లేక పోలీసులని ఉసిగొల్పి మన నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఆయనకీ ఎన్నికలలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పిన ప్రయోఅజనం కనబడటం లేదు. తెదేపా ఒక ఆరిపోయే దీపం వంటిది. దానిని చూసి మనం భయపడాల్సిన పని లేదు. వైకాపా తన కార్యకర్తలకి, నేతలకి అండగా నిలబడి ప్రభుత్వంతో పోరాడుతుంది. చంద్రబాబు నాయుడి మోసాలని ప్రజలు కూడా గ్రహించారు కనుక ఆయనకి ఈసారితో సరి! వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు,” అని రోజా అన్నారు.
జగన్మోహన్ రెడ్డి తన మనసులో కోర్కెలని, ఆలోచనలని ప్రజల కోర్కెలుగా, అభిప్రాయాలుగా అభివర్ణిస్తుంటే, ఆయన అభిప్రాయాలనే తమ అభిప్రాయాలుగా అభివర్ణిస్తుంటారు రోజా వంటి వైకాపా నేతలు. అయితే పార్టీ మారిన తరువాత జగన్మోహన్ రెడ్డి పట్ల వారి అసలు అభిప్రాయాలు ఏవిధంగా ఉన్నాయనేది తెలుస్తుంటుంది. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలనే చాలా బలమైన కోర్కె ఉంది కనుక వైకాపా నేతలు కూడా అందుకు తగ్గట్లుగానే మాట్లాడుతుంటారు. “తెదేపా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తనకి గంట సేపు కూడా పట్టదు,” అని జగన్ గొప్పలు చెప్పుకొన్నందుకు, జగన్ ఏకంగా 20 మంది ఎమ్మెల్యేలని తెదేపాకి వదులుకోవలసి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రోజా కూడా తెదేపా ఆరిపోయే దీపం వంటిదని పలికి రెచ్చగొట్టే విధంగానే మాట్లాడారని చెప్పవచ్చు. గత శాసనసభ సమావేశాలలో కూడా ఆమె స్పీకర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి అనుచితంగా మాట్లాడినందుకు శాసనసభ నుంచి ఏకంగా ఏడాదిపాటు సస్పెండ్ చేయబడ్డారు. దానిపై హైకోర్టు, సుప్రీం కోర్టు వెళ్ళినా ఎదురుదెబ్బలే తగిలాయి. జగన్ మెప్పు పొందడం కోసం మళ్ళీ నోరు జారితే మళ్ళీ సమస్యలలో చిక్కుకోక తప్పదు.