తెదేపా, భాజపాలు ఏనాటికైనా తెగతెంపులు చేసుకోకపోతాయా అప్పుడు భాజపాతో చేతులు కలిపే అవకాశం రాకపోతుందా? అనే ఆశతో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కేంద్రంపై పల్లెత్తు మాట అనకుండా, కేంద్రం అమలుచేయవలసిన హామీలకి కూడా చంద్రబాబు నాయుడినే విమర్శిస్తుంటారు.
అదేవిధంగా ఏనాటికైనా జగన్మోహన్ రెడ్డి మనసు కరుగకపోదా..తమతో చేతులు కలుపకపోరా? అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు ఆశగా ఎదురుచూస్తుంటారు. అందుకే వారు వైకాపా, దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై ఏనాడు విమర్శలు చేయరు. అందుకోసం కాంగ్రెస్ పార్టీ చాలా త్యాగాలు చేస్తుంటుంది. వివిధ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటాలు మొదలుపెట్టి, వాటిని ఆయనకి అప్పగించి పక్కకి తప్పుకొంటుంటుంది.
కాంగ్రెస్ హస్తం నుంచి జగన్ వాటిని నిరభ్యంతరంగా అందుకొంటున్నప్పటికీ, కాంగ్రెస్ అందిస్తున్న స్నేహ హస్తాన్ని మాత్రం అందుకోవడానికి ఇష్టపడటం లేదు. కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం వలన ఆ పార్టీకే లాభం కలుగుతుంది తప్ప వైకాపాకి ఏమి కలుగదనే ఆలోచనతోనే దానిని దూరం పెడుతున్నట్లు భావించవచ్చు. రెండేళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ పడకపోవడంతో, పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి ఓపిక నశించినట్లుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టి నేరుగా విమర్శలు గుప్పించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “జగన్మోహన్ రెడ్డికి ఎంతసేపు ఒకటే ధ్యాస.. ముఖ్యమంత్రి అయిపోవాలని. ఆయన తండ్రి మరణించిన వెంటనే ముఖ్యమంత్రి అయిపోవాలని చాలా తహతహలాడారు కానీ అప్పుడు సాధ్యం కాలేదు. ఇన్నేళ్ళ తరువాత కూడా ఇంకా ఆయన తన తండ్రి పేరు చెప్పుకొనే వైకాపాని నడిపించుకోవలసిన దుస్థితి నెలకొని ఉంది. వైకాపాకి రాజశేఖర్ రెడ్డి పేరే బలం. అది లేకుంటే వైకాపా ఉండదు. వైకాపా ఒక కరిగిపోతున్న ఐస్ క్రీం వంటిది. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా కరిగిపోవడం ఖాయం,” అని అన్నారు.
రాష్ట్ర విభజన చేసిన పాపానికి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. తన ఉనికిని కాపాడుకోవడానికి నానా తిప్పలు పడుతున్నా ఎవరూ దానిని పట్టించుకోవడం లేదు. అందుకే వైకాపాతో పొత్తుకి కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతోంది. కాంగ్రెస్ పార్టీ దుస్థితి తెలిసి కూడా రఘువీరారెడ్డి ఈవిధంగా మాట్లాడటం చాలా విచిత్రంగానే ఉంది.
వచ్చే ఎన్నికల నాటికి వైకాపా కాదు..కాంగ్రెస్ పార్టీయే ఐస్ క్రీంలాగ కరిగిపోయి కనబడకుండా మాయం అయిపోవచ్చునని రాజకీయాల గురించి తెలియనివారు కూడా అనుకొంటున్నారు. కాంగ్రెస్ పార్టీని భారంగా మోసుకొని ఒంటరిగా సాగిపోతున్న రఘువీరుడికి ఈ సంగతి తెలియదనుకోవాలా లేక తెలియనట్లు నటిస్తున్నారనుకోవాలా?