లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తా… అనేది రజనీకాంత్ డైలాగ్. దీన్ని ఎన్టీఆర్ సినిమాకీ అన్వయించుకోవొచ్చు. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ 20 రోజులు ఆలస్యంగా వస్తోంది. సినిమా ఆలస్యమైతే క్రేజ్ తగ్గడం గ్యారెంటీ. కానీ.. జనతా గ్యారేజ్ కి మాత్రం ఆ సమస్యలేం లేవు. ఈ సినిమాపై ముందు నుంచీ సినీ జనాల్లోనూ, అటు ఎన్టీఆర్ అభిమానుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఆగస్టు 12న రావడం ఖాయమనుకొన్న తరుణంలో 20 రోజులు వాయిదా పడడం వాళ్లకు షాకిచ్చినా.. ఈ సినిమాపై క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. `సినిమా బాగా వచ్చింది. మంచి సినిమా ఆలస్యమైనా ఫర్వాలేదు` అని కొరటాల శివ నమ్మకంగా చెబుతున్నాడు కూడా. దాంతో పాటు సినిమా బిజినెస్ ఓ రేంజులో సాగుతోంది.
నైజాం రైట్స్ దిల్రాజు చేజిక్కించుకొన్నారు. అందుకోసం రూ.17 కోట్లు వెచ్చించారని తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్లో ఇది రికార్డు ధర. నాన్నకు ప్రేమతో సినిమా రూ.14 కోట్లకు అమ్ముడుపోయింది. దానికంటే రూ.3 కోట్లు ఎక్కువే ఇచ్చారన్నమాట. నాన్నకు ప్రేమతో రూ.14 కోట్లకు కొన్నా.. లాభాలు రాలేదు. ఆ డబ్బులు అలా సరిపోయాయి. అయినా సరే.. జనతా గ్యారేజీపై రూ.17 కోట్లు పెట్టడం దిల్రాజు నమ్మకాన్ని తెలియజేస్తోంది. ఈ సినిమాపై దిల్రాజు చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాడని, ఈ రిపోర్ట్ ఎప్పటికప్పుడు తెలుసుకొంటున్న దిల్రాజు.. భారీ ధరకు కొనుగోలు చేయడానికి వెనుకంజ వేయలేదని తెలుస్తోంది.