నా క్రేజ్ ఇంకా తగ్గలేదు… అని నిరూపించుకోవడానికి అల్లరి నరేష్ పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. వరుస ఫ్లాపులతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన నరేష్‌కి తాజాగా సెల్పీ రాజా కూడా ఓ మొట్టికాయ వేసింది. దాంతో ఇంకా కూరుకుపోయాడు అల్లరోడు. తెరపై నరేష్ నవ్వించడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటే, చివరాఖరికి అరిగిపోయిన డైలాగుల్ని మళ్లీ మళ్లీ వల్లిస్తుంటే నరేష్ పై జాలేస్తోంది. తొలిరోజు ఓ మాదిరిగా వసూళ్లు వచ్చినా.. రెండోరోజు , మూడో రోజు థియేటర్లు ఖాళీగా కనిపించాయి. అయినా సరే.. చిత్రబృందం ‘బ్రేక్ ఈవెన్ వచ్చేసింది.. సోమవారం నుంచి లాభాలే’ అని ప్రచారం చేసుకొంటూ సెల్పీ డబ్బా కొట్టుకొంటున్నాయి.
నిజానికి సెల్ఫీ రాజాకి అంత సీన్ లేదని విశ్లేషకుల అభిప్రాయం. లాభాల మాట అటుంచితే… కొన్నవారికి సగం డబ్బులైనా వస్తాయా అనేది డౌటుగా ఉంది. ఈ సినిమాకి విపరీతమైన నెగిటీవ్ టాక్ రావడం, దానికి తోడు రివ్యూల్లో ఈ సినిమాని చీల్చి చండాడడం ఇవన్నీ.. సెల్ఫీ రాజా వసూళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. నరేష్ గత సినిమాలు చూసి.. నవ్వలేక ఏడ్చినవాళ్లంతా సెల్ఫీరాజాకు దూరమయ్యారు. నైజాంలో, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ వసూళ్లు బాగానే ఉన్నా.. టోటల్‌గా బ్రేక్ ఈవెన్‌కి రావడం కష్టమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి ఈ సెల్ఫ్ డబ్బా ఎందుకనో…??