వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఉపన్యాసంలో సబ్జెక్ట్ ఏదైనా అజెండా మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తిట్టి పోయడమే. గత రెండేళ్ళుగా ఆయన చంద్రబాబు నాయుడుపై గుప్పిస్తున్న విమర్శలు వినీ వినీ ప్రజలకి కూడా కంటోపాఠం వచ్చేసాయంటే అతిశయోక్తి కాదు. కానీ హరి నామస్మరణం ఎంత చేసినా ప్రహ్లాదుడికి సంతృప్తి కలుగనట్లు, రామ నామస్మరణం ఎంత చేసినా హనుమంతుల వారికి తనివి తీరనట్లుగా, చంద్రబాబు నాయుడుని రెండేళ్లుగా తిట్టిపోస్తున్నా జగన్మోహన్ రెడ్డి కూడా సంతృప్తి కలగడం లేదు…తనివి తీరడం లేదు.
ఆయనకీ ఆ వరం ప్రసాదించింది మాత్రం చంద్రబాబు నాయుడేనని చెప్పక తప్పదు. ఎందుకంటే 2014ఎన్నికల సమయంలో ఇచ్చిన 601 హామీలలో కనీసం ఒక అరడజను హామీలు కూడా పూర్తిగా నెరవేర్చలేకపోయారు. అలాగంటే తెదేపా నేతలు ఎవరూ అంగీకరించరు. చాలా వాటిని అమలుచేశామని మిగిలిన వాటిని దశల వారిగా అమలు చేస్తామని చెపుతుంటారు. ఆ దశలు ఇంకా ఎప్పటికీ పూర్తవుతాయో…తమ దశ ఇంకా ఎప్పటికి తిరుగుతుందో అని జనాలు ఎదురు చూస్తుండగానే రెండేళ్ళు గిర్రున తిరిగిపోయాయి.
“ఈ బాధలన్నీ రెండేళ్ళు ఎలాగో పంటి బిగువున ఓర్చుకొన్నారు…మరొక మూడేళ్ళు ఓపిక పట్టండి చాలు..ఆ తరువాత మన రాజ్యమే డెఫినెట్ గా వచ్చేస్తుంది..అప్పుడు మీ సమస్యలన్నీ మంత్రదండంతో మాయం చేసి పడేస్తాను” అని జగన్మోహన్ రెడ్డి హామీ ఇస్తుంటారు.
“అధికారంలో ఉన్నాము..మనమే ఎప్పటికీ అధికారంలో ఉంటాము” అనే అహంతోనో భ్రమతోనో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకిచ్చిన వాగ్దానాలని పట్టించుకోవడం లేదని జగన్ విమర్శిస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నిలదీయమని..వీలైతే చెప్పులతో, చీపుళ్ళతో కొట్టమని జగన్ పదేపదే ప్రజలకి ఉద్భోదిస్తుంటారు.
అయితే తన రాజకీయ శత్రువు (చంద్రబాబు)ని ప్రజలు కూడా శత్రువుగా చూడాలని కోరుకోవడం సమంజసమేనా? అది సాధ్యమయ్యేనా? పార్టీని బలోపేతం చేసుకోవడానికి చంద్రబాబుని విమర్శించడమే ఏకైక మార్గమా? అదే పార్టీ సిద్దాంతంగా మారిపోయిందా ఇప్పుడు?అని జగన్ ఆలోచించుకొంటే మంచిది.
చంద్రబాబు ఇచ్చిన హమీలని అమలుచేయకపోతే ఏమి చేయాలో ప్రజలే నిర్ణయించుకొంటారు. కనుక ఆ హామీల గురించి ప్రస్తావిస్తూ, ఆ సాకుతో చంద్రబాబుని తిట్టిపోయడం కంటే, నిత్యజీవితంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వాటి పరిష్కారం కోసం ప్రయత్నిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణకి రాష్ట్రంలో కూరగాయలు, పప్పు దినుసుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. అలాగే రాష్ట్రంలో అనేక చోట్ల రోడ్లు, మంచినీళ్ళు వంటి మౌలిక సౌకర్యాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టు టీచర్లు, ఏ.ఎన్.ఎం.లు, ఇతర తాత్కాలిక ఉద్యోగులకి అనేక సమస్యలున్నాయి. వాటి గురించి ప్రతిపక్షాలు గట్టిగా మాట్లాడకపోవడంతో ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు. కనుక ప్రజా సమస్యల పరిష్కారం కోసం గట్టిగా మాట్లాడి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం వలననే వైకాపాని ప్రజలు ఆదరిస్తారు.