తెలంగాణలో కృష్ణా పుష్కరాలను ఘనంగా జరపాలని భావిస్తున్న ప్రభుత్వం, అందుకోసం చేస్తున్న ఏర్పాట్లు మాత్రం పక్కాగా లేవు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా వస్తున్న కృష్ణా పుష్కరాలివి. కాబట్టి పనులు అద్భుతంగా జరుగుతాయని ప్రజలు ఆశించడం సహజం. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగతా ఉంది. అనుకున్న ప్రకారం ఏర్పాట్లన్నీ సకాలంలో పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. కొన్నిచోట్ల నిధులు చాలక పోవడం, మరికొన్నచోట్ల అధికారుల అలసత్వం వల్ల పనులు పూర్తి కావడం అనుమానంగా మారింది.
పుష్కరాలు ఆగస్టు 12న మొదలవుతాయి. ఓ వైపు పుణ్యకాలం సమీపిస్తోంది. ఈ నెల 15 కల్లా పనులు పూర్తికావాలని టార్గెట్ పెట్టుకున్నా సగం కూడా పూర్తికాలేదు. మొత్తం 81 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నా, చాటాచోట్ల పనులు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. పుష్కర ఘాట్లతో పాటు ఆలయాల్లోనూ పక్కాగా పనులు చేయాలి. భక్తులమధ్య తొక్కసలాట జరగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయాలి. చాలా దూరం వరకూ భక్తులు ఇబ్బందిపడకుండా చూడాలి. వర్షాకాలం కాబట్టి వానొస్తే తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం కూడా ఏర్పాట్లు చేయాలి. కానీ చాలా చోట్ల పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి.
గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట నివారించడానికి పక్కాగా వ్యవహరించారు. రాజమండ్రి ఘటనతో తెలంగాణలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వీలైనంత వరకు యాత్రికులకు ఇబ్బంది కలగకుండా కొన్నిచోట్ల అప్పటికప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. ఈసారి ఎందుకో అలసత్వం కనిపిస్తోంది. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో పుష్కర ఘాట్ల ఏర్పాట్ల కోసం 158 కోట్ల రూపాయలను కేటాయించారు. అలాగే ఆలయాల వద్ద పనులను కూడా చేపట్టారు.
పనుల తీరుపై ప్రభుత్వ పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంది. దీంతో చాలాచోట్ల పనులు మొక్కుబడిగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పనులు మొదలుపెట్టిన తర్వాత పత్తాలేకుండా పోయిన కాంట్రాక్టర్ల కోసం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. పనులు ఇలాగే జరిగితే పుష్కరాల యాత్రికులకు కష్టాలు తప్పేలా లేవు. ఘాట్ల వల్ల, ఆ తర్వాత ఆలయాల్లో దర్శనాల సమయంలో తొక్కిసలాట జరిగితే పెను అనర్థం తప్పక పోవచ్చు.