శాసనసభ స్పీకర్ మధుసూధనాచారికి చాలా గొప్ప ధర్మసందేహమే వచ్చింది. ఆయన నిన్న కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం విభాగం ప్రచురించిన కేయు ఎక్స్ ప్రెస్ అనే పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఈ సందేహం వ్యక్తం చేశారు. “స్పీకర్ అనే పదానికి అర్ధం మాట్లాడేవాడు అని అందరికీ తెలుసు. కానీ శాసనసభలో మిగిలిన సభ్యులులాగ నాకు మాట్లాడేందుకు వీలుండదు. నా పని శాసనసభా కార్యక్రమాలు సజావుగా సాగేలాగ చూడటమే. సభలో మాట్లాడేందుకు అవకాశమే ఉందని నా పదవికి స్పీకర్ అని ఎందుకు పేరు పెట్టారో? మీ జర్నలిస్టులే కనుగొని చెప్పాలి,” అని సరదాగా అన్నారు.
ఆయన సరదాగానే అన్నా ఆయన చెప్పిన మాట వాస్తవమే. సభలో జరుగుతున్న ఏ చర్చలో స్పీకర్ పాల్గోనలేరు. దానిపై నిర్భయంగా తన అభిప్రాయాలు చెప్పడానికి వీలుండదు. స్పీకర్ పని సభని కంట్రోల్ చేయడమే. కనుక స్పీకర్ కి బదులు ‘హౌస్ కంట్రోలర్’ లేదా ‘హౌస్ అడ్మిని స్ట్రేటర్’ అనే పదాలు సరిపోతాయేమో!
అధికార, ప్రతిపక్షాల సభ్యుల పట్ల ఎటువంటి పక్షపాత వైఖరి లేకుండా అందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత స్పీకర్ కి ఉన్నప్పటికీ, ఆయన లేదా ఆమె అధికార పార్టీ సభ్యులై ఉంటారు కనుక ప్రస్తుత పరిస్థితులలో ప్రతిపక్షాలని కంట్రోల్ చేయడమే ఆయన లేదా ఆమె బాధ్యత అని పునర్నిర్వచించుకోవలసి వస్తోంది. దానిని అంగీకరించలేని వైకాపావంటి పార్టీలు స్పీకర్ పై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతుంటాయి.