ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మించి ఇచ్చేందుకు సింగపూర్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనల ఆధారంగా స్విస్ చాలెంజ్ విధానం ప్రకారం సి.ఆర్.డి.ఏ. శుక్రవారం గ్లోబల్ టెండర్లు పిలిచింది. జూలై 18 నుంచి సెప్టెంబర్ 1వ తేదీలోగా అంతర్జాతీయ సంస్థలు తమ టెండర్లు సమర్పించవలసి ఉంటుంది. సింగపూర్ సంస్థ కంటే తక్కువ ధరకి ఏ సంస్థ టెండర్లు దాఖలు చేస్తే దానికే రాజధాని నిర్మాణ భాద్యతలు అప్పగిస్తారు.
రాజధాని నిర్మాణం కోసం 1,691 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వమే రూ.5,500 కోట్లు ఖర్చు చేసి అన్నివిధాల అభివృద్ధి చేసి నిర్మాణసంస్థకి అప్పగిస్తుంది. దానిలో ఆ సంస్థ తన స్వంత నిధులతోనే నిర్మాణాలు చేయవలసి ఉంటుంది. ఈ ప్రాజెక్టు (నిర్మాణాల) కోసం మొత్తం రూ.3137 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు సింగపూర్ సంస్థలు పేర్కొన్నాయి. అయితే అవి కేవలం రూ.306.4 కోట్లు మాత్రమే పెట్టుబడి పెడతాయని, మిగిలిన సొమ్ములో మళ్ళీ సి.ఆర్.డి.ఏ. వాటాగా రూ.221.9 కోట్లు చెల్లిస్తుందని సమాచారం. ఆ రెండు సంస్థల పెట్టుబడి మొత్తం రూ.528.3 కోట్లు కాగా మిగిలిన మొత్తాన్ని రాజధాని ప్రాంతంలో ప్లాట్ల విక్రయం, వివిధ ఆర్ధిక సంస్థల నుంచి రుణసమీకరణ ద్వారా సేకరించబోతున్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్టు ద్వారా సింగపూర్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం కల్పిస్తారనే విషయం బహిర్గతం చేయకుండా రహస్యంగా దాచిపెట్టడాన్ని వైకాపా ఆక్షేపిస్తోంది. స్విస్ చాలెంజ్ విధానంలో గ్లోబల్ టెండర్లు పిలుస్తున్నప్పుడు, సింగపూర్ సంస్థలు చేసిన ప్రతిపాదనలను బహిర్గతం చేయకుండా దాచడం వలన ఇతర సంస్థలకి ఆ సంగతి తెలిసే అవకాశం ఉండదు కనుక అవి సింగపూర్ సంస్థల కంటే తక్కువ ధరకి టెండర్లు సమర్పించే అవకాశమే ఉండదని వైకాపా వాదిస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ సంస్థలతో కుమ్మక్కు అయ్యి వాటికే నిర్మాణ భాద్యతలు అప్పగించాలనే ఆలోచనతోనే గోప్యత పాటిస్తున్నారని వైకాపా ఆరోపిస్తోంది. స్విస్ ఛాలెంజ్ విధానమే మనకి చాలా నష్టం కలిగిస్తుందనుకొంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ సంస్థలకి అనుకూలంగా విధించిన అనేక షరతుల వలన ఇంకా నష్టం జరుగుతుందని వైకాపా వాదన. నిర్మాణ సమయంలో ఎటువంటి అవాంతరాలు, సమస్యలు ఎదురైనా వాటికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి రావడమే కాకుండా ఆ సంస్థకి చాలా బారీగా నష్టపరిహారం చెల్లించే విధంగా ఒప్పందం ఎందుకు చేసుకొన్నారు? అని వైకాపా ప్రశ్నిస్తోంది. తద్వారా యావత్ రాష్ట్రం సింగపూర్ సంస్థల చేతిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని, అవి నష్టపరిహారాల పేరుతో రాష్ట్రాన్ని దోచుకొనే అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పిస్తున్నారని వైకాపా వాదిస్తోంది. ఆయన సింగపూర్ సంస్థలతో కుమ్మక్కు అయ్యి రాష్ట్ర ప్రజల భవిష్యత్ ని పణంగా పెట్టడానికి వెనకాడటం లేదని వైకాపా విమర్శిస్తోంది.
స్విస్ ఛాలెంజ్ విధానాన్ని తమ పార్టీ గట్టిగా ఎదురిస్తుందని, అవసరమయితే డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీపై ఒత్తిడి తెచ్చయినా సరే అడ్డుకొంటామని వైకాపా హెచ్చరిస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా స్విస్ చాలెంజ్ విధానంలో రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతామని హెచ్చరిస్తున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం వాటి విమర్శలని, ఆరోపణలని, హెచ్చరికలని, అడుగుతున్న ప్రశ్నలని పట్టించుకోకుండా ముందుకే సాగుతూ టెండర్లు పిలిచింది. మున్ముందు ఏమవుతుందో ఏమో?