రాష్ట్ర విభజన సమస్య తర్వాత ఆంధ్ర, తెలంగాణల మధ్య హై కోర్టు విభజన పెద్ద సమస్యగా మారింది. ఈ అంశంలో సామాన్యుల ప్రమేయం ఏమీ పెద్దగా కనపడటం లేదు కానీ.. రాజకీయ ఎత్తులు మాత్రం దండిగానే కనిపిస్తున్నాయి. హై కోర్టు విభజన జరగాలని ఒక వైపు వాదన వినిపిస్తుండగా మరోవైపు విభజన అంత ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అంశం కాదనే వాదన వినిపిస్తుంది. విభజనను కోరుతున్నది తెలంగాణ వైపు నుంచి కాగా, విభజన అంత అర్జెంటేమీ కాదంటున్నది ఏపీ ప్రభుత్వ ముఖ్యులు. ఈ విషయంలో ఇప్పటికే చాలా రచ్చ జరిగింది. ఇదే విషయంలో కేంద్రం కూడా పెద్దగా పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తోంది. హైకోర్టు విభజన తమ పరిధిలోని అంశం కాదని కేంద్ర న్యాయశాఖ మంత్రి స్వయంగా సెలివచ్చారు!
అయితే తాజాగా కేసీఆర్ ఢిల్లీపర్యటనతో సీన్ మారిందనే ప్రచారం జరుగుతోంది. హైకోర్టు విభజన విషయంలో సీఎం కేసీఆర్ గట్టిగా పట్టుబట్టాడని.. దీని పట్ల ప్రధానమంత్రి సానుకూల స్పందన వ్యక్తం చేశాడని అంటున్నారు. వీలైనంత త్వరలో ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరి ఇదే జరిగితే.. బాబుకు ఇష్టం లేని పని జరగడం మొదలైనట్టే!
హైకోర్టు విభజన విషయంలో ప్రధాన అభ్యంతరం చంద్రబాబుదేనని.. వివిధ సమీకరణాల నేపథ్యంలో హైకోర్టు విభజన అంశం అంత ప్రాధాన్యతను ఇవ్వాల్సింది కాదని.. బాబు వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం నేతలు కూడా ఇదే మాట చెబుతున్నారు. ప్రధానంగా జగన్ కేసు లు తెలంగాణ వాటా కింద వెళతాయనే భావనే బాబుకు హై కోర్టు విభజన ఇష్టం లేనిదిగా మారిందని ప్రచారం జరుగుతోంది. ఇన్ని రోజులూ కేంద్రం హైకోర్టు విభజన అంశం గురించి మిన్నకుండిపోయిందన్నా.. దానికి చంద్రబాబే కారణమనే ప్రచారమూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో మోడీతో కేసీఆర్ మీటింగ్ హైకోర్టు విభజనకు ఊతాన్ని ఇస్తోందంటున్నారు. మరి బాబుకు ఇష్టం లేని ఆ పనిని మోడీ చేయడానికి చొరవ చూపుతారా?!