ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేసింది. చిత్తూరు జిల్లా కుప్పంలో పలార్ నదిపై ప్రభుత్వం నిర్మిస్తున్న ఆనకట్ట, ఆ నదిపై ఏర్పాటు చేసిన చెక్ డ్యామ్ ల ఎత్తు పెంచడం వలన దానిపైనే ఆధారపడున్న ఉత్తర తమిళనాడులోని వెల్లూరు, కాంచీపురం, తిరువాన్మలై, తిరువళ్ళూరు జిల్లాలలో 4.20 లక్షల ఎకరాలు బీడు భూములుగా మారిపోతాయని, సాగునీరే కాకుండా త్రాగు నీరు కూడా లభించదని, వాటితో బాటు చెన్నై నగరానికి కూడా త్రాగు నీటికి కరువొస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖలు వ్రాశారు. కానీ ఆయన వాటిని పట్టించుకోకపోవడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది.
కర్నాటక నుంచి ఏపి గుండా తమిళనాడులోకి ప్రవహించే పాలార్ నదిలో వర్షాలు బాగా పడినప్పుడే ప్రవాహం బాగుంటుంది. మిగిలిన సమయంలో పెద్దగా ప్రవాహం ఉండదు. దానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అడ్డుకట్ట వేస్తే దిగువనున్న తమకి చాలా అన్యాయం జరుగుతుందని తమిళనాడు ప్రభుత్వం తన పిటిషనులో పేర్కొంది. 1892 పలార్ ఒప్పందం ప్రకారం ఆ నదిపై కొత్తగా ఎటువంటి ఆనకట్టలు కట్టడానికి వీలులేదు. కానీ ఏపి ప్రభుత్వం ఆ నిబంధనలని ఉల్లంఘించి కుప్పంలో ఆనకట్ట కడుతోందని తమిళనాడు ప్రభుత్వం తన పిటిషనులో పిర్యాదు చేసింది. ఆనకట్టలు కట్టడమే కాకుండా చాలా చోట్ల చెక్ డ్యాములు ఏర్పాటు చేసి, వాటి నుంచి పిల్ల కాలువలు ఏర్పాటు చేసుకొని నీళ్ళని మళ్ళిస్తోందని ఆరోపించింది. ఏపి సిఎంకి లేఖలు వ్రాసినప్పటికీ ఆయన స్పందించకపోవడం చేతనే సుప్రీం కోర్టుని ఆశ్రయించవలసి వచ్చిందని, కనుక ఈ వ్యవహారంలో కలుగజేసుకొని తమకి న్యాయం చేయవలసిందిగా కోరింది.
పలార్ నది కర్ణాటకలో కోలార్ జిల్లాలోని నంది కొండలలో పుట్టి ఆ రాష్ట్రంలో 93 కిమీ ప్రవహించి , ఏపిలోకి ప్రవేశిస్తుంది. ఏపిలో కేవలం 33 కిమీ మాత్రమే ప్రవహించి తమిళనాడులోకి ప్రవేశించి అక్కడ ఏకంగా 222 కిమీ ప్రవహించి చివరికి వాయలూరు దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. అంటే ఈ నదిపై తమిళనాడే ఎక్కువగా ఆధారపడి ఉందని, దాని వలన అదే ఎక్కువ ప్రయోజనం పొందుతోందని స్పష్టం అవుతోంది. కనుక తన ప్రయోజనాలకి భంగం కలుగుతున్నందుకు అది సుప్రీం కోర్టులో సవాలు చేయడం సహజమే.
తెలంగాణా ప్రాజెక్టులపై ఏపి ప్రభుత్వం ఏవిధంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందో, పలార్ నదిపై ఏపి ప్రభుత్వం నిర్మిస్తున్న ఆనకట్టపై తమిళనాడు ప్రభుత్వం కూడా అదే విధంగా ఆవేదన, అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఒకవేళ తెలంగాణా ప్రభుత్వం తప్పు చేస్తోందని ఏపి ప్రభుత్వం భావిస్తున్నట్లయితే, ఏపి ప్రభుత్వం కూడా అదే తప్పు చేస్తున్నట్లు చెప్పకతప్పదు. నీటి వనరులు పరిమితంగా ఉన్నప్పుడు వాటిని పెంచుకోవడానికి అన్ని ప్రభుత్వాలు గట్టిగా కృషి చేసినట్లయితే, ఇటువంటి సమస్యలు, ఘర్షణలు, న్యాయపోరాటాలు తగ్గించుకోవచ్చు.