చరిత్రని పాఠాలు నేర్చుకోవడానికో, ఒకదేశ సంస్కృతీ సంప్రదాయాలు, నాటి పరిస్థితులని ఆకళింపు చేసుకోవడానికో ఉపయోగించుకొంటే ప్రయోజనం ఉంటుంది కానీ ఇతరులని నిందించడానికి చరిత్రని వాడుకొందామని చూస్తే బెడిసి కొడుతుందని రాహుల్ గాంధీ నిరూపించారు.
రెండేళ్ళ క్రితం మహారాష్ట్రలోని భివండిలో జరిగిన ఒక బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “మహాత్మాగాంధీని ఆర్.ఎస్.స్. హత్య చేసింది” అని అన్నారు. గాంధీజీని హత్య చేసిన వ్యక్తి నాథురాం గాడ్సే ఆర్.ఎస్.స్.కి చెందిన వ్యక్తి కనుక ఆ విధంగా చెప్పారు. అయితే నాథురాం గాడ్సే చర్యని ఆర్.ఎస్.స్. ఎప్పుడు సమర్ధించలేదు. గాంధీ హత్యపై దేశ ప్రజలందరూ ఏవిధంగా బాధ పడ్డారో ఆర్.ఎస్.స్.నేతలు కూడా అదేవిధంగా బాధపడ్డారు. తమలో ఒక వ్యక్తి చేసిన చెడ్డపని వలన అందరికీ చెడ్డపేరు వచ్చిందని అందరూ బాధపడ్డారు. ఇదంతా చరిత్ర.
దానిని రాహుల్ గాంధీ అనవసరంగా త్రవ్వి తీసి ఆర్.ఎస్.స్.పై నిందవేశారు. అందుకు ఆగ్రహించిన ఆర్.ఎస్.స్. రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేసింది.
ఆ కేసుని ఇవాళ విచారణకి చేపట్టిన సుప్రీం కోర్టు రాహుల్ గాంధీకి చివాట్లు పెట్టింది. “ఒక వ్యక్తి చేసిన తప్పుకి యావత్ సంస్థని ఏవిధంగా నిందిస్తారు? దీనిపై మీ వివరణ ఇవ్వండి లేదా ఆర్.ఎస్.స్.ని నిందించినందుకు క్షమాపణ చెప్పండి,” అని రాహుల్ గాంధీని ఆదేశిస్తూ కేసుని జూలై 27కి వాయిదా వేసింది. “రాహుల్ గాంధీ చేసిన ఆ వ్యాఖ్యలలో అసలు నిజం ఉందా? దాని వలన దేశానికి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా?” అని ఆయన తరపున వాదిస్తున్న న్యాయవాదులని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
ఒకప్పుడు యూపియే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు, రాహుల్ గాంధీ ఆర్.ఎస్.స్.పై తరచూ ఇటువంటి ఆరోపణలు చేస్తూనే ఉండేవారు. ఆర్.ఎస్.స్. అంటే ఒక దేశ వ్యతిరేక సంఘం, అసాంఘిక శక్తి అన్నట్లుగా మాట్లాడేవారు. కానీ అప్పుడు తమ పార్టీయే అధికారంలో ఉంది కనుక ఎవరూ ప్రశ్నించలేకపోయేవారు. కేంద్రప్రభుత్వానికి ఆర్.ఎస్.స్.కి ఉన్న బలమైన సంబంధాల గురించి తెలిసి ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ అలవాటు ప్రకారం ఆర్.ఎస్.స్.పై నిందలు వేసి దొరికిపోయారు. ఇప్పుడు దానికి క్షమాపణ చెపితే అందరి ముందు తలవంచుకోవలసి వస్తుంది. చెప్పకపోతే సుప్రీం కోర్టు చేత మొట్టికాయలు వేయించుకోవడమే కాకుండా, ఆర్.ఎస్.స్.కి పరువు నష్టం క్రింద బారీగా డబ్బు ముట్ట జెప్పాల్సివస్తుంది. అది కూడా అవమానమే. కనుక ఈ కేసు నుంచి రాహుల్ గాంధీని గౌరవప్రదంగా ఏవిధంగా బయటపడతారో చూడాలి.