రెండో శనివారం సెలవు గురించి మనకందరికీ తెలుసు. కానీ మూడో శనివారం ప్రత్యేకత తెలుసా? తెలుగుదేశం అందులోనూ తెలంగాణ టిడిపి నేతలకు మాత్రమే ఆ ప్రత్యేకత వర్తిస్తుంది. ఏమంటే ప్రతినెలా మూడో శనివారం టిటిడిపి నేతలతో చర్చలకు కేటాయిస్తానని పార్టీ అధినేత ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారట. చాలా కాలం తర్వాత ఆదివారం నాడు ఆయన ఈ నేతలతో సావధానంగా భేటీ జరపడం పట్ల వారు చాలా ఉత్సాహంగా వున్నారు. ఈ సందర్బంలో తెలంగాణ మాట ఎలా వున్నా ఎపిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చంద్రబాబు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజంటేషన్కు వారంతా ముగ్ధులై పోయారట. ఈ ఆనందం మాతో ఒక టీవీ చర్చలో పాల్గొన్న తెలుగుదేశం ప్రతినిధిలో విపరీతంగా తొణకిసలాడుతుంటే మొత్తానికి బాగానే ఎక్కించారు అని మీడియా మిత్రుడు వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు హడావుడి తరలింపు తర్వాత చంద్రబాబు నాయుడు టిటిడిపిని దాదాపు వదిలేశారనే భావన ఏర్పడింది.దానికి తోడు ఫిరాయింపులు.. ఇటీవలనే మరోసారి కాలూచేయి కూడదీసుకునే ప్రయత్నం మొదలైందన్నమాట. నిజానికి జాతీయ అద్యక్షుడుతమకు సమయం ఇస్తానన్నాతామే సరిగా ఉపయోగించుకోలేకపోయామని కొందరు టినేతలంటున్నారు. అయితే అది కూడా పాక్షిక సత్యమే. తాను ఆశలేకనే తెలంగాణను వదిలేశాననే భావన పోగొట్టాలని చంద్రబాబు సంకల్పించినట్టు కనిపిస్తుంది. విభజన జరిగిన కొత్తలోనైతే ఆయన ఎపికన్నా టిటిడిపికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని అవతలివారు గుర్రుగా వుండేవారు. ఓటుకు నోటు దాన్నంతటినీ మార్చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి పునరావృతం కాబోతుందా? అయినా ఫలితం ఏమైనా వుంటుందా? ముందు ముందు చూడాల్సిన ముచ్చట. అది కూడా మూడో శనివారం.. ఆ రోజు ఏ అధికార కార్యక్రమం పెట్టుకోకుండా వీరికే కేటాయిస్తారట బాబుగారు. తథాస్తు.