* 1600 ఎకరాల డెవలప్ మెంటుకు 15 ఏళ్ళగడువా!
* ప్రయివేట్ కంపెనీగా అమరావతి అభివృద్ధి సంస్ధ!
* సింగపూర్ తో పరుగు – పోటీదారుల కాళ్ళు కట్టేసిన టెండరు నోటీసు!
* సింగపూర్ కు వరాలే వరాలు – అంతుచిక్కని అమరావతి రహస్యాలు!
సింగపూర్ సంస్ధల్ని దాదాపు ఏభారతీయ సంస్ధా చాలెంజ్ చేయడానికి సాధ్యం కాని విధంగా రూపొందించిన స్విస్ చాలెంజ్ లో టెండరు గెలుచకునేది సింగపూర్ కన్సారిటియమే! ఒక వేళ ఏ సంస్ధైనా కన్సార్టియమ్ కంటే తక్కువ రేటు కోట్ చేస్తే ఆతక్కువకే తాను పనిచేయగలనంటే అపుడు సింగపూరు సంస్ధలకే వర్క్ ఆర్డర్ ఇవ్వాలి. ఏకపక్షంగా సింగపూరు సంస్ధలకు కట్టబెట్టే ”చాలెంజ్” పనిలో సీడ్ కేపిటల్ ప్రాంతంలోని కేవలం 1600 ఎకరాలను అభివృద్ధి చేయడానికి 15 సంవత్సరాలు గడువు ఇచ్చింది.
సింగపూర్ సంస్థల ప్రతిపాదనలను సవాల్ చేస్లూ బిడ్లు సమర్పించే వారికి సెప్టెంబర్ ఒకటిని చివరి తేదీగా ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం రాత్రి పిలిచిన ఓపెన్ టెండర్లలో ప్రభుత్వ యాజమాన్యంలో వున్న ”అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ (ఎడిపి)” నుప్రయివేటు సంస్థగా పేర్కోనడం పెద్ద ప్రశ్నార్ధకం .
రెండు వేల కోట్ల రూపాయల నికర ఆదాయం కానీ, ఆ మేరకు ఆస్తులు కానీ ఉంటేనే స్విస్ ఛాలెంజ్లో పాల్గొనడానికి ఇతర బిడ్డర్లు అర్హులని ప్రభుత్వం పేర్కొంది. అదే విధంగా వరుసగా మూడు సంవత్సరాల పాటు 600 కోట్ల రూపాయల వార్షిక ఆదాయాన్ని కూడా ఆ సంస్థలు పొంది ఉండాలి. ఈ మేరకు ఆడిట్ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. భారతదేశంలోగానీ, ఇతర దేశాల్లోగానీ కనీసం వెయ్యి హెక్టార్లను ఇప్పటికే అభివృద్ధి చేసి ఉండాలన్నది మరో షరతు. అంటే, 2,500 ఎకరాలను ఇప్పటికే అభివృద్ధి చేసిన బిడ్డర్లు మాత్రమే సింగపూర్ సంస్థలు చేసిన ప్రతిపాదనలను చాలెంజ్ చేయాల్సి ఉంటుంది. ఇంతకీ సీడ్ కేపిటల్ ప్రాంతంలో ప్రస్తుతం అభివృద్ధి చేయదలచింది 1600 ఎకరాలు మాత్రమే!
అభివృద్ధి చేసిన భూమిలో 300 హెక్లార్లను కనీసం మార్కెటింగ్ చేసి ఉండాలన్నది మరో షరతు. 2.5 హెక్టార్లలో గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టును అభివృద్ధి చేసి ఉండాలని, 5 మిలియన్ల (50 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఇప్పటికే నిర్మాణాలు చేసి ఉండాలని కూడా ప్రభుత్వం షరతు విధించింది. అదే విధంగా బిడ్లు దాఖలు చేసే సంస్థలు ఇప్పటికే 25 వేల మందికి కనీసం ఉపాధి కల్పించి ఉండాలని, దేశంలోని ఏదో ప్రాంతంలో కనీసం రెండు జాయింట్ వెంచర్లు ప్రభుత్వంతో కలిసి చేసి ఉండాలని నిబంధనల్లో పేర్కొంది.
ఈ కఠిన షరతులు ఇతర బిడ్డర్లను పోటీలో లేకుండా చూసేందుకే నని ఎవరికైనా అర్ధమైపోతూంది. పనిలో క్వాలిటీ రీత్యా ప్రపంచశ్రేణి కాంట్రాక్టర్ల కోసమే ఈ షరతులు విధించారని ఎంత సమర్ధించుకోవాలన్నా కుదరదు. కేవలం 1600 ఎకరాల డెవలప్ మెంటుకి 15 ఏళ్ళ గడువు ఎందుకన్నదే ప్రశ్న…అంత వ్యవధి అవసరమే అనుకుంటే అవకాశం స్వదేశీ కాంట్రాక్టర్లకు ఎందుకు ఇవ్వరన్నది మరో ప్రశ్న!
ఓపెన్ టెండర్ లో అనుమానాల నివృత్తికి ఆఖరు తేదీ ఆగస్టు 8గా, ప్రి బిడ్ కాన్ఫరెన్స్ ఆగస్టు 8 గా నిర్ణయించింది. టెండర్ల షార్ట్ లిస్ట్ ఈఏడాది సెప్టెంబర్ 6న వెలువడనుంది. బిడ్ వాలిడిటీని 2017 ఫిబ్రవరి 28 వరకు నిర్ణయించారు.
ఒక్కమాటలో చెప్పాలంటే ” ఈ టెండరు నోటీసు తయారుచేసింది సింగపూర్ సంస్ధలా లేక రాష్ట్రప్రభుత్వమా ” అనిపిస్తూంది. స్విస్ చాలెంజ్ విధానం ఎంపిక వల్ల పారదర్శకత లోపిస్తుందని భారత ప్రభుత్వం నియమించిన కేల్కర్ కమిటీ స్పష్టం చేసింది. ఇది భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ని తీవ్రమైన అవినీతి ఆరోపణల్లోకి నెట్టేస్తుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ లక్షకోట్లు మింగేశారు అని పదేపదే విమర్శించే తెలుగుదేశం పార్టీకి ముందు ముందు ఆ అవకాశం ఉండకపోవచ్చు!