అది తెలుగుదేశం అనుకూల ఛానల్. ఎంతగా అనుకూలం అంటే చెప్పలేనంత. ఏపీలో మరో ఇరవైఏళ్ల పాటు కూడా చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటాడని.. అసలు ఏపీలో జగన్ పార్టీ ఉనికి ఏమాత్రం లేదని.. జగన్ పార్టీ కథ అయిపోయిందని.. ఒకసారి అయినా చెప్పనిది ఆ ఛానల్ కు రోజు గడవదు. ఎలాంటి విశ్లేషణనైనా ఏదైనా ఆధారం చూపి చేస్తే.. అది అర్థవంతం అనిపించుకుంటుంది. అయితే ఆ ఛానల్ కు అలాంటి అభ్యంతరాలేమీ లేవు.
ఒక సగటు తెలుగుదేశం అభిమానిని సంతృప్తి పరచడానికి విశ్లేషించినట్టుగా ఉంటాయి అందులో విశ్లేషణలు. అదే ఛానల్ లో ప్రతిరోజూ ఒక పోల్ నిర్వహిస్తారు. ఏదైనా ఒక రాజకీయ అంశాన్నో లేక ఎవరైనా రాజకీయ నాయకుడి కామెంట్ నో కోట్ చేస్తూ..దానిపై ఎస్ఎమ్ఎస్ ల ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తారు. ఆ పోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమిటంటే.. అది ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ కి అనుకూలంగానే ఉంటుంది. బాబు ప్రభుత్వ తీరు విషయంలో విమర్శ ఏదైనా కానీ, వైకాపా నేతలతో ఏకీభవిస్తారా? అంటే ‘లేదు’ అనే ఆప్షన్ వైపు 60 నుంచి 90 శాతం ఓట్లు ఉంటాయందులో. అదే తెలుగుదేశం అనుకూలమైన అంశంపై పోల్ పెడితే.. ఇంతే శాతం మంది ‘అవును’ అనే ఆప్షన్ వైపు ఉంటారు. ఇదంతా రొటీనే!
మరి అలాంటి ఛానల్ తాజాగా ఒక సారి వైకాపా అనుకూల పవనం వీచింది! ఎన్నడూ కనిపించని వింత అది. కొశ్చన్ ఏమిటంటే.. ‘ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసే అధికారం ఎన్నికల కమిషన్ కు ఇవ్వాలి.. అన్న వైకాపా వాదనతో ఏకీభవిస్తారా?’ అనే పశ్నకు అరవై శాతం మంది అనుకూలంగా నలభై శాతం మంది వ్యతిరేకంగా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఫిరాయింపుల విషయంలో వైకాపా వైఖరిని ఆంధ్రా వరకూ తెలుగుదేశం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఆ ఛానల్ లో వైకాపా అభిప్రాయానికి ఎక్కువ అనుకూలత కనిపించడం విశేషం. బహుశా.. తెలంగాణలో తెలుగుదేశం నుంచి ఫిరాయించిన వారిని దృష్టిలో ఉంచుకుని ఈ రకమైన ఫలితాలను చూపించారో ఏమో..అనే అనుమానం కూడా ఉందిక్కడ!