హిట్టు కోసం వీరలెవిల్లో ప్రయత్నాలు చేస్తున్నాడు సుశాంత్. కరెంట్, అడ్డా సినిమాలు ఫట్టుమనడంతో తదుపరి సినిమాకోసం చాలా టైమ్ తీసుకొన్న సుశాంత్ ఇప్పుడు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఆటాడుకొందాం రా సినిమా చేశాడు. ఈ సినిమా ఎప్పుడో పూర్తయ్యింది. కానీ.. విడుదలకు మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తోందీ చిత్రబృందం. మెల్లిమెల్లిగా పబ్లిసిటీ కూడా మొదలెట్టేసింది. అందులో భాగంగానే ఈ రోజు సుశాంత్ లుక్‌ని కూడా విడుదల చేశారు. ఫ్రెంచ్ గడ్డంతో సుశాంత్ బాబు డిఫరెంట్‌గా కనిపిస్తున్నా.. అదెందుకో సుశాంత్‌కి సూట్ కాలేదు. ఇది వరకే ఈ బాబు బాగున్నాడు.. అనిపించేలా ఉంది లుక్. ఇలాంటి లుక్ల్ని బయటపెట్టేముందు సుశాంత్‌తో పాటు, దర్శక నిర్మాతలూ కాస్త ఆలోచిస్తే బాగుంటుంది. సినిమా చూడాలన్న ఆ కాస్తంత ఆశనీ… సుశాంత్ ఏదో ఓ రూపంలో చంపేయాలనుకొంటే ఎలా?? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వెనుక అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున లాంటి భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా, కేవలం సుశాంత్ కోసమే సినిమాలు తీసే నిర్మాత (చింతలపూడి శ్రీనివాసరావు) ఉన్నా… సుశాంత్ వరుసగా సినిమాలు తీయలేకపోతున్నాడు, తీసినా హిట్టు కొట్టలేకపోతున్నాడు. ఇలాంటి దశలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఎనీవే.. లుక్ ఎలాగున్నా సినిమా మాత్రం బాగుండాలని కోరుకొందాం. అన్నట్టు ఆగస్టు 19న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.